హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. నాలుగో రోజైన ఆదివారం కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తున్నది. విచారణలో రవి కీలక విషయాలు చెప్పకుండా.. తన వ్యక్తిగత విషయాలు మాత్రమే వెల్లడిస్తున్నాడని ఓ సీనియర్ పోలీస్ అధికారి విశ్వసనీయంగా తె లిపారు. పైరసీ ఎలా చేశారో, నెట్వర్క్ ఎలా పని చేసిందో చెప్పడంలేదని అన్నారు. ఏదైనా అడిగితే గుర్తులేదని మా త్రమే చెప్తున్నట్టు వెల్లడించారు.
పైరసీతో వచ్చిన డబ్బులతో తాను విలాసవంతమైన జీవితం గడిపానని, పది పదిహేను రోజులకు ఒక దేశం తిరిగేవాడినని మాత్రమే తెలిపాడని వివరించారు. అందుకే కేసు కొలిక్కితీసుకురావడం సవాల్‌గా మారిందని చెప్పారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లిన రవి.. అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో సెయింట్ కిట్స్, నెవిస్ పౌరసత్వం తీసుకున్న రవి.. విదేశాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ నడిపినట్టు పోలీసులు చెప్పారు. రవికి చెందిన ఖాతాలోని రూ.3.5 కోట్లు సీజ్ చేశారు.
హైదరాబాద్, వైజాగ్‌లలోనూ రవి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు విచారణ బృందంలోని ఓ అధికారి తెలిపారు. ఎక్కడికి వెళ్లినా బిజినెస్ క్లాస్ ఫ్లైట్లలో ట్రావెల్ చేస్తూ.. లగ్జరీ హోటల్స్‌లో గడిపినట్టు వివరించారు. ఒంటరిగానే ఉంటూ ఆధునికమైన లైఫ్ైస్టెల్తో ఎంజాయ్ చేశానని రవి చెప్పినట్టు ఓ అధికారి వెల్లడించారు.