హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): పీడీలను, పీఈటీలను కేవలం వ్యాయామ సంబంధిత డ్యూటీలకే పరిమితం చేయాలని, ఇతర బాధ్యతలను అప్పగించవద్దని తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ పీడీ, పీఈటీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రామలక్ష్మణ్, ప్రెసిడెంట్ నర్సయ్య, జనరల్ సెక్రటరీ చందర్, మహిళా విభాగం ప్రెసిడెంట్ నీరజ సంయుక్తంగా ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
ఎస్సీ గురుకుల డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో పనిచేస్తున్న పీడీ (ఫిజికల్ డైరెక్టర్లు) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల (పీఈటీ)జాబ్చార్ట్కు సంబంధం లేని కేర్ టేకర్, వార్డెన్, లంచ్ డ్యూటీ లు, ఇతర పరిపాలనా బాధ్యతలు అప్పగించేందుకు సొసైటీ ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
అదనపు నాన్-కోర్ డ్యూటీ లు విధిస్తే పని భారం పెరిగి శారీరక శిక్షణ నాణ్యత తగ్గడంతోపాటు, విద్యార్థుల ఫిట్నెస్, క్రీడా ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఇకనైనా ఉన్నతాధికారులు పీడీ, పీఈటీలను కోర్ స్పోర్ట్స్ డ్యూటీలకే పరిమితం చేయాలని, నాన్ కోర్ డ్యూటీలను విధించాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.