ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యనారాయణరెడ్డి. గ్రామం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి. నిజానికి ఆయన ఆదర్శ రైతు. మంచి విద్యావంతుడు. ఇటీవల జ్వరంతోపాటు చిన్నపాటి అనారోగ్యంతో నగరంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నాడు. వైద్యులు రాసిన మందులు, మెడికల్ షాపులో అధిక రేట్లు వసూలు చేసిన తీరు, మందులు వాడుతున్న సమయంలో ఎదుర్కొన్న సమస్యలపై నేరుగా కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి (డీఎంహెచ్‌వో)కు ఫిర్యాదు చేయడానికి ఫోన్ ద్వారా ప్రయత్నం చేశాడు.
ఒకటి రెండు సార్లు కాదు, రెండు రోజుల్లో దాదాపు యాబై సార్లు కాల్ చేసినా డీఎంహెచ్‌వో లిఫ్ట్ చేయలేదు. దీంతో సత్యనారాయణరెడ్డి అధికారుల తీరును ‘నమస్తేతెలంగాణ’కు వివరించగా, ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్తే.. ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఆ సమయంలో తాను మీటింగ్‌లో ఉన్నానంటూ సర్ది చెప్పారు. మీటింగ్ అయిన తర్వాతైనా కాల్ చేశారా అంటే అదీ లేదు. ఇది వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి తీరు కాగా, ఇది ఒక్క ఉన్నతాధికారికే పరిమితం కావడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ మొత్తంగా పరిస్థితి ఇలానే ఉండడం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ విద్యానగర్: సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఎవరికైనా వైద్యపరంగా సహాయం పొందడం కోసం.. లేదా ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు కరీంనగర్ జిల్లా అధికారులు హెల్ప్‌లైన్ నంబర్ (98499-02501)ను అందుబాటులోకి తెచ్చారు. ఇది 24 గంటలు పనిచేస్తుందని, ఫోన్చేయగానే అవసరమైన సహాయం అందుతుందని ప్రకటించారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ నంబర్ రింగ్ అవుడే తప్ప ఎత్తే వారులేరు. నిర్ధారణ కోసం ‘నమస్తే తెలంగాణ’ సైతం మంగళవారం మధ్యాహ్నం 2.58 గంటలకు రెండు సార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు.
అంటే హెల్ప్‌లైన్ కేవలం పేపర్లకు, ఆర్భాటపు ప్రకటనలకు తప్ప ఏ ఒక్కరికీ ఉపయోగడం లేదు. అసలు నిర్వహణ బాధ్యత ఎవరిదన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. నిజానికి ఇది చాలా అత్యంత ప్రాధాన్యత నంబర్. వచ్చిన సమస్యను బట్టి హెల్ప్‌లైన్ పరిధిలోని వైద్యసిబ్బంది 108 వాహనాలను అలర్ట్ చేయాలి. అలాగే సంబంధిత ఏరియా వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. అంతేకాదు, ప్రజల నుంచి హెల్ప్‌లైన్‌కు వచ్చే సమస్యలను పరిశీలించి, సదరు సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకున్నదా..? లేదా..? అన్నదానిపై ఉన్నతాధికారులు సమీక్షించాలి. కానీ, వైద్య శాఖలో ఇదేది కనిపించడం లేదు. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నది.
ఆర్భాటపు ప్రకటనలు
సీజనల్ వ్యాధులు ప్రారంభం కాగానే.. వైద్య ఆరోగ్యశాఖ నుంచి రోటీన్‌గా ఒక ప్రెస్‌నోట్ విడుదల చేస్తారు. ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించి, ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పత్రికలకు ప్రకటనలు ఇస్తారు. విచిత్రం ఏమిటంటే అందులో ఇచ్చిన ఏ ఒక్క నంబర్‌కు ఫోన్ చేసినా సరైన స్పందన ఉండదు. ప్రస్తుతం అయితే మెజార్టీ వైద్య సిబ్బంది, అధికారులు పూర్తిగా పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ సీజన్లోనూ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. హైరిస్క్ ప్రాంతాలను గుర్తించామని, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడేలు నిర్వహిస్తున్నామని, గతంలో డెంగ్యూ ప్రబలిన ప్రాంతాల్లో ఈ సారి మళ్లీ ప్రబలకుండా చర్యలు తీసుకున్నామని, ఎమర్జెన్సీ అవసరాల కోసం ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించామని అన్ని జిల్లాల్లోనూ ప్రకటించారు. కానీ, ఏ జిల్లాలోనూ చెప్పింది చెప్పినట్టు క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదు.
ప్రైవేట్ దవాఖానల దోపిడీ
అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం, పారిశుద్ధ్యలోపం వంటి అనేక కారణాలు జ్వరాలు ప్రబలడానికి కారణాలు అవుతున్నాయి. దీంతో రోగులు దవాఖానలకు పరుగులు పెడుతుండగా, ఇదే అదునుగా పలు ప్రైవేట్ హాస్పిటళ్లు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. రకారకాల పరీక్షలతో దండుకోవడమే కాదు, చాలాచోట్ల డెంగ్యూ బూచి చూపి లక్షలకు లక్షలు దోచుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఎలిసా పాజిటివ్ వస్తేనే డెంగ్యూగా నిర్ధారించాల్సి ఉన్నా.. ఎటువంటి నిర్ధారణ చేయకుండానే భయపెట్టడం ఆందోళన కలిగిస్తున్నది.
నిజానికి చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అత్యధిక దోపిడీ కరీంనగర్ జిల్లాకేంద్రంలోనే జరుగుతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలో చూస్తే.. 516 దవాఖానలు నడుస్తుండగా, అందులో మల్టీస్పెషాలిటీ పేరిట 276 హాస్పిటళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో 1 నుంచి 20 బెడ్స్ వరకు 161 దవాఖానలు ఉండగా, 21 నుంచి 50 బెడ్స్ వరకు 91, అలాగే 51 నుంచి 100 వరకు 19 ఉండగా, వీటితోపాటు 101 నుంచి 200 బెడ్స్ ఉన్నవి 3, అలాగే 200లకుపైగా బెడ్స్ ఉన్నవి రెండున్నాయి. మొత్తంగా ప్రభుత్వం, ప్రైవేట్ కలిపి చూస్తే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 12,945 బెడ్స్ ఉన్నట్టు వైద్య శాఖ చెబుతున్నది.
నియంత్రణ కరువు
సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఆ బృందాలు ఎప్పటికప్పుడు ప్రైవేట్ దవాఖానలను ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు న్యాయం చేయాలి. ట్రీట్మెంట్లో తేడా ఉన్నా, అధిక ఫీజులు వసూలు చేసినా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే సీజ్ చేయాలి. కానీ, ఈ సీజన్లో ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా నిఘా కొరవడింది. ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వెళ్లి ప్రైవేట్ హాస్పిటళ్లను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అంతేకాదు, సీజనల్ సమయంలో ప్రతిరోజూ ఆయా హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్ల వివరాలు సైతం డీహెచ్ఎంవో కార్యాలయానికి చేరాలి.
కానీ, ఏ ఒక్క ప్రైవేట్ దవాఖాన ఈ నిబంధనలను పాటించడం లేదు. దీనిపై నిత్యం సమీక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో కొంత మంది వైద్య సిబ్బంది శభాష్ అనేలా పనిచేస్తున్నా.. జిల్లాకేంద్రాల్లోని ఉన్నతాధికారులు, సిబ్బంది మొద్దు నిద్ర వీడడం లేదనే తెలుస్తున్నది. ఇటు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల గోల నడుస్తుండగా. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందులోనే ఉంటున్నారే తప్ప వైద్యం అందించే అంశంపై పెద్దగా చూపడం లేదు.
సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ కలెక్టర్లు నేరుగా రంగంలోకి దిగాలన్న డిమాండ్ నాలుగు జిల్లాల నుంచి వస్తున్నది.
అన్ని జిల్లాల్లోనూ హెల్ప్లైన్ల నంబర్లు 24 గంటలు పనిచేసేలా చూడడంతోపాటు దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించారా..? లేదా..? అన్నదానిపై ఎప్పటికప్పుడు రివ్య్యూ చేయడానికి ఒక అదనపు కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి.
ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా ఎదురయ్యే సమస్యలను నేరుగా చెప్పకోవడానికి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖతోపాటు కలెక్టరేట్లోనూ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులు నేరుగా స్వీకరించాలి. అప్పుడే ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. అలాగే వైద్యరంగంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నివారించవచ్చు.
ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలి. అవి కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేయాలి. ప్రతి రోజూ ఒకటి రెండు దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు చేసేలా చూడాలి. సదరు హాస్పిటళ్లు ఏ నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడమే కాదు, అవసరమైతే సీజ్ చేయాలి.
రోగికి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారా..? అందుకు అనుగుణంగానే బిల్లులు వసూలు చేస్తున్నారా..? సదరు దవాఖాన వర్గాలు రిజిస్ట్రేషన్ సమయంలో డీఎంహెచ్‌వో కార్యాలయానికి ఇచ్చిన ధరలను డిస్ప్లే చేస్తున్నారా..? ఆ మేరకే తీసుకుంటున్నారా..? ఇలా నిశిత పరిశీలన చేయాలి. ఎక్కడ తేడా వచ్చినా చర్యలు తీసుకోవాలి.
ముఖ్యంగా జ్వరాలను అరికట్టేందుకు గ్రామాల్లోనే వీలైనంత మేరకు పరీక్షలు చేసి వైద్య చికిత్స అందేలా చూడాలి.
మీడియాకు ఇచ్చిన నంబర్లకు ఫోన్లు వచ్చిన సమయంలో రిసీవ్ చేసుకోక పోయినా, సదరు వైద్యులు స్పందించకపోయినా, సిబ్బంది సమాధానం చెప్పకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే మరోసారి నిర్లక్ష్యం అనే మాటే వినిపించదు.
ప్రధానంగా సీజన్ వ్యాధులకు అడ్డుకట్ట పడే వరకు డీఎంహెచ్‌వోతోపాటు వైద్య సిబ్బంది 24 గంటల అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
కలెక్టర్లు కేవలం సమీక్ష సమావేశాలు, వైద్యశాఖ చెప్పిన పైపై మాటలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతుంది. అలాగే ప్రైవేట్‌లో దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.