లక్నో: పెళ్లి చేసుకోవాలని 60 ఏళ్ల మహిళ ఒత్తిడి చేసింది. అయితే వివాహమై పిల్లలున్న ఒక వ్యక్తి దీనికి నిరాకరించాడు. వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళ అడ్డు తొలగించుకునేందుకు ఆమెను హత్య చేశాడు. (Man Kills Woman) ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల ఇమ్రాన్ ఆగ్రాలోని తాజ్‌గంజ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. పెళ్లైన అతడికి పిల్లలున్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇమ్రాన్ అత్తమామలు నివసిస్తున్నారు. వారి పొరుగున నివసించే 60 ఏళ్ల జోషినా కుమార్తె ముంతాజ్‌కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు అతడు సహకరించాడు. ఆగ్రాకు చెందిన సత్తార్‌తో ఆమె వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, జోషినా మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
మరోవైపు నవంబర్ 10న మనవరాలి వివాహం కోసం కోల్‌కతా నుంచి ఉత్తరప్రదేశ్‌కు జోషినా వచ్చింది. ఆగ్రాలోని ఇమ్రాన్ ఇంటిని ఆమె సందర్శించింది. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. అయితే భార్య, పిల్లలు ఉండటంతో అతడు నిరాకరించాడు. పెళ్లి కోసం బలవంతం చేస్తున్న జోషినా అడ్డు తొలగించుకోవాలని అతడు భావించాడు.
అయితే నవంబర్ 13న జోషినాను దింపే నెపంతో ఆమెతో కలిసి ఇమ్రాన్ వెళ్లాడు. వారిద్దరూ బస్సు ఎక్కారు. హత్రాస్ జిల్లా చాంద్పా ప్రాంతంలోని నాగ్లా భూస్ ట్రైసెక్షన్లో బస్సు దిగారు. అక్కడ గొంతునొక్కి జోషినాను ఇమ్రాన్ హత్య చేశాడు. నేరాన్ని తప్పుదారి పట్టించేందుకు ఆమె బట్టలు చించాడు. ఆమె మొబైల్ ఫోన్‌ను మరోచోట పడేసి పారిపోయాడు.
కాగా, నవంబర్ 14న జోషినా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె హత్యపై దర్యాప్తు కోసం పది పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల పరిధిలో వెయ్యికిపైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. చివరకు ఇమ్రాన్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆదివారం హత్రాస్‌లోని హతిసా వంతెన సమీపంలో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు ఇమ్రాన్‌ను ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో జోషినాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె మొబైల్ ఫోన్ పడేసిన ప్రాంతం గురించి అతడు ఇచ్చిన సమాచారంతో దానిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Rajnath Singh | సరిహద్దులు మారవచ్చు.. సింధ్ భారత్‌లోకి తిరిగి రావచ్చు: రాజ్‌నాథ్ సింగ్
School Girl Raped | స్కూల్ గ్రౌండ్లో బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి