హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ‘గాంధీ సరోవర్’ పేరిట పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లు కూల్చడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హితవుపలికారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ ప్రాజెక్టు చేపట్టవచ్చని సూచించారు.
మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదని, పేదల ఇండ్లు కూల్చితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. పేదలకు పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ ఇండ్లు పంపిణీ చేసిన తర్వాతే ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్, విఘ్నేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను నిరాశ్రయులను చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.