అమరావతి : రైతులను అడుగడుగునా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ ( Chandra babu collar ) ను పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) పేర్కొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమవుతుంటే రైతులవైపు కన్నెత్తిచూడడం లేదని ట్విటర్లో ఆరోపించారు.
కూటమి పాలన కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు వేసిన పంటలను ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకువచ్చారని వెల్లడించారు. దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కానుకూడా తీసివేసి వారిని రోడ్డుమీద నిలబెట్టి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ఎండమావులు చూపిస్తారా అంటూ నిలదీశారు.
విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రల కోసం డబ్బులను దుబారా చేస్తున్నా రైతులను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని దుయ్యబట్టారు. ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతులను ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడం లేదని ఆరోపించారు.
ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు , కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 నెలల కూటమి పాలనలో 16 సార్లు ప్రకృతి విపత్తుల సంబవిస్తే ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోలేదని విమర్శించారు.
రైతులల తరఫున పోరాటాలు చేస్తున్న వైసీపీ నాయకులపై ఎదురుదాడి చేస్తూ, అన్యాయంగా కేసులు పెడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి, పీఎం కిసాన్కాకుండా ఏడాదికి రూ.2౦వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని, రెండేళ్లకు రూ.40వేలకు గాను ఇచ్చింది కేవలం రూ.10వేల నని విమర్శించారు.