RPI | సిరిసిల్ల టౌన్, మే 20: హైకోర్టు ఆదేశాలతో పూర్తి పారదర్శకంగా తమ స్థలాన్ని జిందం చక్రపాణికి ఇవ్వడం జరిగిందని ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి రెడ్డిమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయంలో అక్రమం జరిగిందంటూ బీజేపీ నేత నాగుల శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సిరిసిల్లలోని కూరగాయల మార్కెట్లో 583 సర్వే నంబర్లో తమ సొంత భూమి 9 గుంటలు నాడు మున్సిపల్ నిర్వహించిన ప్రజాకోర్టులో తమ భూమిని మున్సిపల్ ద్వారా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సదరు స్థలం మున్సిపల్ తీసుకున్నందుకుగానూ ఫ్లాట్ నంబర్ 525ను నాటి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు తమకు కేటాయించిందని తెలిపారు.
మున్సిపల్ తమకు కేటాయించిన ఈ స్థలంలో తాము ఇంటి నంబర్ తీసుకుని షెడ్డు వేసుకున్న అనంతరం బీఆర్ఎస్ నేత జిందం చక్రపాణి సోదరుడు జిందం దేవదాసుకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ స్థలానికి సంబంధించిన ఎటువంటి ఆదారాలు లేకుండానే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీకు సదరు స్థలానికి చెందిన అన్ని ఆధారాలు తాము అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
మున్సిపల్ స్వాధీనం చేసుకున్న స్థలానికి బదులుగా ఈ స్థలం కేటాయించిందని స్పష్టం చేశారు. మా సొంత పట్టా భూమిని మేము అమ్ముకుంటే నాగుల శ్రీనివాస్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అవగాహన లేకుండా మాట్లాడితే తాము తీసుకుబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.
అవాస్తవాలు ప్రచారం..
బీఆర్ఎస్ యూత్ నాయకుడు కత్తెర వరుణ్ మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకుడు నాగుల శ్రీనివాస్ పట్టణంలోని ప్రముఖులను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సంబంధించిన బార్ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేశాడని, నేడు వారి సోదరుడి ఇంటి విషయంలోనూ అదే తంతు చేస్తున్నడని అన్నారు.
మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ బార్ నిర్మాణం జరిగిందని గుర్తుంచుకోవాలన్నారు. బార్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్‌కు అన్ని రుసుములు చెల్లించారని తెలిపారు. బీజేపీ పట్టణాధ్యక్ష పదవి కోల్పోయినప్పటికీ అదే హోదాను వినియోగించుకుని పార్టీ కార్యాలయంలో కూర్చుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నాడని అన్నారు. ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారం మున్సిపల్ అధికారులు ఇవ్వగానే సదరు సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్ దందాలు చేస్తున్నాడన్నారు.
కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్న విధంగా పొద్దున లేస్తే పట్టణంలోని ప్రముఖులను టార్గెట్ చేసుకుని ఆస్తుల వివరాలు సేకరిస్తున్నాడని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూత్ పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజకుమార్, మునీర్, కూర శ్రీధర్, కాసర్ల పవన్, పంగ మధు, జిందం మహేందర్, వేముల గంగాధర్, రాహుల్, అడిచెర్ల సాయికృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ