Karimnagar | చిగురుమామిడి, మే 20 : చిగురుమామిడి మండలంలో బొమ్మనపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముత్యాల కొమురయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కొమురయ్య పశువుల పాక ముందు ఉన్న 11కేవి విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాకడంతో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న పశువులపాకకు మంటలు అంటుకొని, 1200 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయని బాధిత రైతు తెలిపాడు. ఈ ప్రమాదంలో ఆవు తీవ్రంగా గాయపడింది. డ్రిప్ వైర్లు, తార్లలిన్ కవర్లు, పశువులపాక పూర్తిగా కాలిపోయింది. రైతు కొమరయ్య అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల వరకు నష్టపోయానని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధ్యత రైతు కొమురయ్య ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.