Child | ఎల్లారెడ్డిపేట, జూన్ 8 : బొప్పాపూర్‌కు చెందిన మోతుకు రామచంద్రం-రవళి దంపతుల కూతురు హిమాన్షి(4) విషజ్వరం బారిన పడి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, మృతి చెందిన చిన్నారి బంధువులు అందించిన వివరాల ప్రకారం రామచంద్రం-రవళి దంపతులకు అను(6), హిమాన్షి(4) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రామచంద్రం బతుకుదెరువు నిమిత్తం గల్స్ బాటపట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
రామచంద్రం చిన్న కూతురు హిమాన్షికి శుక్రవారం రాత్రి జ్వరం రావడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స చేయించి ఇంటికి తెచ్చారు. శనివారం రోజంతా బాగానే ఉన్నప్పటికీ రాత్రి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. దీంతోపాటు జ్వరం ఉందని గమనించి చిన్నారిని తల్లి మరోమారు సిరిసిల్లకు చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఫిట్స్వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కొద్దిసేపటికే చిన్నారి మృతి చెందిందని వైద్య సిబ్బంది తెలుపడంతో చిన్నారి తల్లి రోదనలు మిన్నంటాయి.
ఫ్రీజర్‌లో చిన్నారి బాడీ..
చిన్నారి మృతి చెందిన సమాచారంతో ఆమె తండ్రి రామచంద్రం గల్స్ నుంచి రావడానికి సమయం పడుతుందని బాడీ ఫ్రీజర్‌లో ఉంచారు. కాగా విషజ్వరం బారిన పడి చిన్నారి మృతి చెందిన ఘటనతో ఆశావర్కర్లు గ్రామంలో సర్వే చేపట్టారు. కాగా బొప్పాపూర్‌లో ఆరువేల జనాభా ఉండగా కేవలం ఇద్దరు ఆశావర్కర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి జనాభాకు ఒక్క ఆశావర్కర్ ఉండాలి. గతంలో ముగ్గురు ఆశావర్కర్లు ఉండగా.. ఒక ఆశావర్కర్ అనారోగ్యం కారణంగా పని మానేసింది. ఆమె స్థానంలో మరొకరని నియమించే వెసులుబాటు లేక పోవడంతో ఇద్దరు ఆశావర్కర్లు ఆరువేల జనాభా వివరాలు తీసుకుంటున్నారు.
ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే మరింత ఒత్తిడి అవుతున్నట్లు ఆశావర్కర్లు వాపోతున్నారు. గ్రామంలో ఇద్దరే ఉండటంతో గ్రామంలోని కుటుంబాల ఆరోగ్య వివరాలు సేకరించడం కోసం ఒత్తిడికి లోనవుతున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో విషజ్వరాలు పెరిగే ప్రమాదం ఉందని ఓ వైపు విష జ్వరాలు, మరోవైపు అధిక జనాభా ఆరోగ్య వివరాల సేకరణ ఎన్ని ఇబ్బందులు తెస్తాయోనని అంటున్నారు. జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లను నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి