Telangana Cabinet | తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై 17 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆదివారం నాడు జి.వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇవాళ ముగ్గురిని భర్తీ చేశారు. మార్పు చేర్పులతో ఐదు బెర్తులు పూరించాలని తొలుత భావించినా, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురి పేర్లకు ఆమోదం లభించినట్టు తెలిసింది.
ఉత్కంఠత తర్వాత వివేక్‌కు చోటు!
మంత్రివర్గ విస్తరణలో మొదట్నుంచి జి.వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం ఉదయం అనూహ్యంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. వివేక్ కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురికి పదవులు ఇవ్వడంతో మళ్లీ వారికే ఇస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీంతో గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. తనకు అవకాశం ఇవ్వకుంటే ప్రత్నామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని వివేక్ హెచ్చరించినట్టు తెలిసింది. మీడియాతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన కుటుంబాన్ని వదులుకోవడం ఇష్టంలేని అధిష్ఠానం మధ్యేమార్గంగా వివేక్‌కు స్పీకర్ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, తనకు మంత్రి పదవి తప్ప మరేమీ వద్దని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆయనే మంత్రి పదవిని ఖరారు చేశారు.
బీసీ కోటాలో వాకిటి.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్
బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉన్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో ఉన్నారు. మాదిగ ఎమ్మెల్యేలంతా శనివారం మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. మీనాక్షి నటరాజన్‌తోనూ మాట్లాడినట్టు తెలిసింది. నాలుగో బెర్తు నింపితే కచ్చితంగా మాదిగలకు అవకాశం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.