Rajanna Sircilla | ఎల్లారెడ్డిపేట, మార్చి 10: రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ వృద్ధుడిపై కుల పెద్దలు దాష్టీకం ప్రదర్శించారు. తాము చెప్పిన మాట వినడం లేదని కుల బహిష్కరణ చేశారు. అయినా సంతృప్తి చెందక అతను ఉండే రేకుల షెడ్డును సైతం నేలమట్టం చేసి రాక్షాసానందం పొందారు.
బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన కంచర్ల దేవయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. కాగా, దేవయ్య ఉంటున్న రేకుల షెడ్డు వెనుక భాగంలో పెద్ద కొడుకు శ్రీనివాస్ కొత్త ఇంటిని కట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో దేవయ్య ఉంటున్న రేకుల షెడ్డు తను కొత్తగా ఉంటున్న ఇంటికి అడ్డుగా ఉండటంతో.. దాన్ని తొలగించి వేరే దగ్గర కట్టిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చాడు. దీనికి కుల పెద్దలు కూడా సమ్మతించారు.
అయితే దేవయ్య తమ్ముడు చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. దీంతో తాను ఉంటున్న షెడ్డును కొద్దిరోజుల తర్వాత తీసేస్తానని దేవయ్య చెప్పాడు. కానీ ఇందుకు దేవయ్య కోడలు, శ్రీనివాస్ భార్య అయితే లత ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో తరచూ దేవయ్యతో గొడవ పడేది. ఈ క్రమంలోనే తనను దేవయ్య తిడుతున్నాడని.. పెద్ద మనుషులను కూడా బూతులు అంటున్నాడని లత కుల పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన పెద్దలు సోమవారం రాత్రి దేవయ్య ఇంటికి వచ్చి గొడవకు దిగారు. మళ్లీ మంగళవారం ఉదయం వచ్చి షెడ్డును తొలగించాలని పట్టుబట్టారు. కానీ షెడ్డును తొలగించనని దేవయ్య కరాఖండీగా చెప్పేశాడు. ఆ మాటతో కోపోద్రేక్తులైన కుల పెద్దలు.. కుల బహిష్కరణ చేశారు. అతని కళ్ల ముందే షెడ్డును నేలమట్టం చేశారు. ఈ విషయంపై తాజాగా దేవయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుల బహిష్కరణ చేసిన పెద్దలపై కేసు నమోదు చేశారు. కంచర్ల రాజు, శరబందు, మల్లేశం, శంకర్, నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే.. లత కూడా పోలీసులను ఆశ్రయించింది. తన మామ శ్రీనివాస్, మరిది సతీశ్ కొంతకాలంగా తనను మాననికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దేవయ్య, సతీశ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.