Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 11 : కార్యాలయ పనివేళల అనంతరం కూడా అదనపు పనులు అప్పగిస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నదనే ఫిర్యాదు మేరకు కరీంనగర్ జిల్లా సంక్షేమాధికారిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి మంగళవారం విచారణ చేపట్టారు. నగరంలోని అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన విచారణకు కరీంనగర్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీడీపీవోలు, సూపర్వైజర్లు, మినిస్టీరియల్ సిబ్బంది హాజరు కాగా, వారందరినీ వ్యక్తిగతంగా విచారించారు.
సాధారణ కార్యకలాపాల నిర్వహణ, ఉద్యోగులు, ఇతర సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరుతోపాటు కందిపప్పు, కోడిగుడ్ల సరఫరాలో కూడా జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరైన వారిలో పలువురిని వివరాలడిగి నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. భేటి బచావో భేటీ పడావో కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీసినట్లు సంబంధిత ఉద్యోగులు పేర్కొంటున్నారు.
రెండోరోజు కూడా విచారణ కొనసాగనుండగా.. ఐసీడీఎస్‌కు అనుబంధంగా ఉన్న డీహబ్, ఐసిపిఎస్, సఖి, చిల్డ్రన్ హోం సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందిని విచారించనున్నట్లు విచారణాధికారిగా వచ్చిన ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు ఝాన్సీలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను వివరణ కోరగా, కొద్ది మాసాల క్రితం జిల్లా సంక్షేమాధికారిపై పలు ఆరోపణలు చేస్తూ కమిషనర్‌కు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శృతి ఓజా విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
విధుల పట్ల అప్రమత్తం చేయటమే తప్ప..
ప్రధానంగా పనివేళల అనంతరం సిబ్బందికి కార్యాలయ పనులు పురమాయించటం, తోటి అధికారులతోపాటు సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించటం, కందిపప్పు కొనుగోళ్లు, భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమ నిర్వహణలో జరిగిన అవకతవకలపై విభాగాల వారీగా విచారిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా తోటి ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది పట్ల తానెప్పుడు దురుసుగా వ్యవహరించలేదని, విధుల నిర్వహణ పట్ల అప్రమత్తం చేయటమే తప్ప, ఇతరత్రా ఎలాంటి కార్యక్రమాలు పురమాయించలేదని. నాపై చేసిన అవినీతి ఆరోపణలన్నీ సత్యదూరమని జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి కొట్టిపారేశారు.


Read Also :
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం