Maneru Vagu trap | సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 16 : కొన్ని రోజులుగా వరుణుడి ప్రతాపానికి ఓ వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. కుండపోత వర్షాల ధాటికి చాలా గ్రామాల్లో కుంటలు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అయితే వాళ్లకు మాత్రం అవేం పట్టనట్టుంది. వారంతా ఎండాకాలం అనుకున్నారో.. ఏమో వాగులో ఇసుక తీసుకురావాలని ఫిక్సయ్యారు. ఇంకేంటి అందరూ కలిసి వరదలను సైతం లెక్కచేయకుండా వాగులోకి ట్రాక్టర్లలో వెళ్లి అక్కడే చిక్కుకుని పోయారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గట్టపల్లి మానేరు వాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. గట్టపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు లేబర్తో కలిసి ఇసుక తీసుకువెళ్లేందుకు మానేరు వాగుకు ఐదు ట్రాక్టర్లతో వెళ్లారు. అయితే వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో ట్రాక్టర్లు, మనుషులు అందులో ఇరుక్కుపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మరో ముగ్గురు ఇరుక్కున్న వారిని రక్షించేందుకు పెద్ద ట్రాక్టర్ను తీసుకొని వెళ్లారు.
అయితే నీటి ప్రభావంలో గుంతలు ఏర్పడకపోవడంతో పెద్ద ట్రాక్టర్ పడి వాళ్లు కూడా అందులోనే ఇరుక్కుపోయారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ సుబ్బారెడ్డి బృందం స్థానికులతో కలిసి వెళ్లి తాళ్ల సాయంతో 9 మందిని క్షేమంగా బయటకి తీశారు. సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ట్రాక్టర్లు మాత్రం అందులోనే వాగులోనే ఉండిపోయాయి.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల