Ramagundam Tree | కోల్ సిటీ, డిసెంబర్ 23: ఇది గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రక్కన గల పెద్ద చెట్టు. నిన్నటి దాకా నీడనిచ్చిన ఈ సాధారణ చెట్టు చుట్టే ఇప్పుడు రామగుండం రాజకీయాల్లో వేడి రగిలిస్తోంది. అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గోదావరిఖని నుంచే కాదు.. వివిధ ప్రాంతాల నుంచి చౌరస్తా మీదుగా వెళ్ళేవారి దృష్టిని ఆకర్షిస్తోంది.
అదిగో.. ఇదే ఆ చెట్టు.. అంటూ అందరి నోటా మార్మోగుతోంది.. మొత్తంగా రామగుండంలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో చౌరస్తా మీదుగా వెళ్లే ప్రయాణీకులు సైతం ఈ చెట్టు వైపు…కాసేపు తదేకంగా తొంగిచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ చెట్టుకు అంత పేరు ఏమిటన్న ఆతృత కలుగుతోందా…? గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఇటీవల సిరిశెట్టి జయసుధ మల్లేశంలకు చెందిన భవనాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఆ సంఘటనపై బీఆర్ఎస్, జేపీపీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు, ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది.
మూడు రోజులుగా చౌరస్తాలో సత్యగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఐతే కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఇదే చెట్టును అడ్డాగా చేసుకొని ఇక్కడ నుంచే రాజకీయాలు ఇతరత్రా వ్యవహారాలు నడిపిస్తున్నారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకులు కౌశిక హరి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్, మహేశ్, రవీందర్ తదితరులు ఆ చెట్టు సాక్షిగానే కూల్చివేతలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు.
దీనితో ఒక్కసారిగా నగరంలో ఆ చెట్టు గురించే వాడివేడి చర్చ దావానంలా వ్యాపించింది. ఎక్కడ చూసినా ఈ చెట్టు గురించే ప్రస్తావన జరుగుతోంది. ఇన్నాళ్లు ఈ చెట్టు అడ్డాగా మంతనాలు, వ్యవహారాలు నడిపించిన వారు ఈ సంఘటనతో ఇప్పుడెందుకు కనిపించడం లేదంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడంతో అందరి దృష్టి చెట్టు మీదకే వెళ్తుంది. ఈ చెట్టు కిందనే మందు, విందు రాజకీయాలు నడుస్తున్నాయన్న వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది.

Manchu Manoj | మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్
Dense Fog | తీవ్రమైన పొగమంచుతో పలు వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
Anchor Anasuya | ‘మా బాడీ మా ఇష్టం’.. నటుడు శివాజీకి అనసూయ కౌంటర్