హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కోకాపేట్ నియోపోలీస్ పరిధిలోని శారదాపీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నించడం దుర్మార్గమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. నిన్నిటి వరకు పేదల ఇండ్లు కూలగొట్టిన రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇప్పుడు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర స్థలాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ వందలాది మంది పోలీసులు, రెవెన్యూ అధికారులతో చుట్టుముట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చతెచ్చే చర్య అని ఖండించారు. భక్తులు, పీఠాధిపతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భయాందోళనలు సృష్టించడం ప్రభుత్వం దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు. వాటర్ వర్స్ నిర్మాణం పేరుతో దేవాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.