మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు నరకం చూపిస్తున్నది. ఎవరి ఇంటిని ఏ కారణంతో కూలుస్తారో తెలియక నగర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలైతే నిత్య నరకం చూస్తున్నారు. ఇటీవల మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా రూ.5 వేల కోట్లతో గాంధీ సరోవర్‌ను ఏర్పాటు చేస్తామని, భూసేకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. పక్కా పట్టా భూముల్లో అన్ని అనుమతులు పొంది వెంచర్ల ద్వారా నిర్మించుకున్న ఇండ్లను సైతం ఖాళీ చేయాలని నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గంధంగూడ గ్రామంలోని పలు కాలనీల్లో మూసీకి సమీపంలో ఉన్న వందలాది ఇండ్లు నోటిఫికేషన్లో ఉన్న సర్వే నంబర్లలో ఉన్నాయి. దీంతో తమ ఇండ్లను స్వాధీనం చేసుకుంటారేమోనని మనస్థాపం చెందుతున్నారు.
– సిటీబ్యూరో, బండ్లగూడ, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ)
మూసీ పునరుజ్జీవం పేరిట బఫర్‌జోన్ పరిధిని ఇష్టానుసారం మార్చి తమ ఇండ్లను కూల్చాలని చూస్తున్నారని గంధంగూడ ప్రజలు ఆరోపిస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూలుస్తామనడం దుర్మార్గమని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లో హైదర్షా కోట్ పరిధి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ తోపాటు గంధంగూడలోని పలు కాలనీల ఇండ్లకు సంబంధించిన సర్వే నంబర్లు ఉన్నాయి. అందులో పేర్కొన్నట్లు గంధంగూడలోని శ్రీవిగ్నేశ్వర కాలనీ, రంగారెడ్డి కాలనీ, డ్రీమ్ హోమ్స్ అపార్ట్మెంట్, ఫోర్ట్ వ్యూ, కేంద్రీయ విహార్, సాయిరాం నగర్, విశాల్ నగర్, సాయి హర్ష నగర్, సౌభాగ్య నగర్ సహా పలు కాలనీల ఇండ్లు ఉన్నాయి.
పట్టా భూముల్లో అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇండ్లను నిర్మించుకున్నామని, ప్రభుత్వమే అనుమతులిచ్చి.. మళ్లీ ప్రభుత్వమే బఫర్‌జోన్‌లో ఉన్నాయని చెబుతుండటం కాంగ్రెస్ దుర్మార్గపు పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో పాటు బ్యాంకులోన్లు తీసుకుని కట్టుకున్న ఇండ్లను లాక్కుంటామంటే తాము ఎక్కడికి వెళ్లాలని నిలదీస్తున్నారు.
ఇండ్లను కోల్పోయి బజారున పడ్డ తర్వాత ఈఎంఐలు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సరైన విధి విధానాలు రూపొందించకుండానే తమ ఇండ్లను లాక్కుంటామని ఎలా నోటిఫికేషన్లు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టుకు కనీసం డీపీఆర్ లేదు.. ఇండ్లను కోల్పోతున్న వారికి పరిహారం ఏ ప్రాతిపదికన చెల్లిస్తారో చెప్పకుండా నోటిఫికేషన్లు, నోటీసులు, గ్రామసభలంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లను వదిలి వెళ్లేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీవిగ్నేశ్వర కాలనీలోని సర్వే నంబర్ 87లో 2016-17లో వేసిన వెంచర్లో ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నా. నేను ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. వచ్చిన జీతాన్ని దాచిపెట్టుకొని, దాంతో పాటు బ్యాంకులో లోన్ తీసుకుని 2019లో ఇల్లు కట్టుకున్నా. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్‌కు నెలకు రూ.70 వేలు ఈఎంఐ చెల్లిస్తున్నా.
– రాజు, శ్రీవిగ్నేశ్వర కాలనీ, గంధంగూడ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం గంధంగూడ, మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వద్దకు రానున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు తెలిపారు. మూసీ బాధితులకు అండగా నిలిచి.. వారిలో ధైర్యం నింపేందుకు కేటీఆర్ వస్తున్నట్లు చెప్పారు.