ముంబై, ఫిబ్రవరి 28: దేశీయ విమానప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. జనవరి నెలలో 1.524 కోట్ల మంది ప్రయాణించారని పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ తన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 4.36 శాతం పెరిగారని తెలిపింది. వీరిలో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూపు, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ విమానాల్లో 1.46 కోట్ల మంది ప్రయాణించారని తెలిపింది. పైలెట్లపై కఠిన నిబంధనల కారణంగా ఇండిగో మార్కెట్ వాటా 4 శాతం తగ్గి 63.6 శాతానికి పడిపోయింది. గత నెలలో ఇండిగో 97.04 లక్షల మంది విమాన ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేర్చింది. అలాగే ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా కూడా 3 శాతం తగ్గి 26.5 శాతానికి పరిమితమైంది. జనవరి నెలలో ఆకాశ ఎయిర్ రికార్డు స్థాయి 93.2 శాతం సీటింగ్ కెపాసిటీతో విమాన సర్వీసులను నడిపింది. ఇండిగో 87.7 శాతం సీటింగ్ కెపాసిటీ కలిగివున్నది. తక్కువ స్థాయిలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.