హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జలమండలికి కేటాయింపును రద్దు చేయాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై అధికారులతో చర్చించారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. జలమండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి, పీఠం ప్రతినిధులకు సూచించారు.