హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): శారదా పీఠంలోని రాజశ్యామల మందిరం జోలికొస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శారదా పీఠానికి రెండెకరాల స్థలం కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ఆ స్థలంలో నిర్మించిన రాజశ్యామల మందిరాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి గడ్డపార సర్కార్ను నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. హైడ్రా, మూసీ పేరిట ఇండ్లు కూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఖమ్మంలో సైతం పేదల ఇండ్లను కూల్చిందని మండిపడ్డారు. శారదా పీఠంలోని గుడిని కూల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఆలయాలు, మఠాల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.