Organ Donation | రామగిరి జూన్ 10 : మరణానంతరం కూడా మానవ శరీరాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని సదాశయ ఫౌండేషన్ జాతీయ సలహాదారు నూకా రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి చోడవరపు లింగమూర్తి అన్నారు. మంగళవారం ప్రపంచ నేత్రదాన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం డివిజన్ 3లోని సెంటినరి కాలనీలోని మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నేత్ర, శరీర, అవయవ దానాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు.
మరణానంతరము నేత్రదానం వల్ల అంధులైన వారికి చూపు ప్రసాదించవచ్చని, అవయవ దానంవల్ల మరికొందరికి పునర్జన్మ ప్రసాదించవచ్చని, శరీర దానం వైద్య కళాశాల విద్యార్థుల విద్యాబోధనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మరణాంతరం శరీరాలను ఖననం చేసినా, దహనం చేసినా ప్రయోజనం ఉండదని కనుక వాటిని సమాజ ప్రయోజనాల కోసం వైద్య కళాశాలలకు ఉపయోగించాలన్నారు.
మొదటగా ఇనిస్టిట్యూట్ మేనేజర్ నేత్ర దానానికి ముందుకు వచ్చి డోనార్ కార్డ్ స్వీకరించారు. అలాగే శిక్షణ పొందిన 30 మంది యువ ఉద్యోగులు సదాశయ ఆశయానికి సంసిద్ధత ప్రకటించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు వారికి డోనర్ కార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సదాశయ కార్యవర్గ సభ్యులు వెల్ది అనంతరాములు రాజమహేందర్ రెడ్డి సమ్మయ్య సపాల్గొన్నారు. నేత్ర అవయవ శరీర దానాలకు ముందుకు వచ్చిన యువకులను అర్జీ- 3 జీఎం కొలిపాక నాగేశ్వరరావు ఎస్ వో టూ జీఎం. బి వి సత్యనారాయణ, సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రచార కార్యదర్శి వాసు, మాజీ జెడ్పిటిసి వెంకటరమణారెడ్డి అభినందించారు.