Yellampally fish farming | పెద్దపల్లి, జూన్ 04 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్టాత్మకమైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇరిగేషన్ భూములను కబ్జా చేసి అక్రమంగా చెరువులను తవ్వి కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచుతున్నారని, ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించడమే కాకుండా హైదరాబాద్ త్రాగునీటి సరఫరా(హెచ్ఎండబ్ల్యూఎస్) ప్లాంటుకు కూడా కలుషిత జలాలు వెళుతున్నాయని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మూడు రోజులుగా నమస్తే తెలంగాణ దిన పత్రికలో వస్తున్న వరుస కథనాలపై పెద్దపల్లి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఎట్టకేలకు అధికార పార్టీ నాయకుల, ఉన్నతాధికారుల అండదండలను పక్కన పెట్టి క్షేత్ర స్థాయి పర్యటనకు పెద్దపల్లి జిల్లా అధనపు కలెక్టర్(రెవెన్యూ) దాసరి వేణు ఆధ్వర్యంలో అధికారుల బృందం వచ్చింది.
ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఏరియా హెచ్ఎండబ్ల్యూఎస్, వాటర్ గ్రిడ్‌కు ఎగువన ముర్మూరులో నిర్మించిన అక్రమ చెరువులను పరిశీలించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డీ. వేణు మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖకు సంబంధించి సుమారు 70 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా చేసి అక్కడ ఏర్పాటు చేసిన అక్రమంగా చేపల చెరువులను తవ్వినట్లుగా గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ చేపల చెరువు(ఫిష్ పాండ్)లను వెంటనే తొలగించాలని ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఎవరైతే ఈ ఆక్రమణలు చేశారో.. వారికి ఫోన్ చేసి పిలిపించాలని స్థానిక అధికారులను కోరగా.. వారి ఫోన్లకు వారు స్పందించలేదు. దీంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపల చెరువులను నిర్వహిస్తున్న వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని..
70 ఎకరాల ప్రభుత్వ భూమిని మళ్లీ స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఈఈ నీటి పారుదల శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి చేపల చెరువులో కలుపుతున్నారని, మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని మత్స్య శాఖ అధికారులు ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. అక్రమంగా జరుగుతున్న నీటి ఎత్తిపోతల వ్యవస్థ పూర్తి స్థాయిలో తొలగించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఈ చేపల చెరువుల దిగువన గల ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మహానగరానికి సరఫరా చేసే త్రాగు నీటిలో ఎటువంటి కలుషిత పదార్దాలు లేవని అన్నారు. ఈ మేరకు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు.
హైదరాబాద్ నగరానికి సరఫరా చేసే త్రాగు నీటి ముందుగా హెచ్ఎండబ్ల్యూఎస్ సైట్ ఇంజనీర్‌తో కలిసి పరిశీలించి అవసరమైన పరీక్షలు నిర్వహించి, హైదరాబాద్‌కు పంపే త్రాగు నీటిలో ఎటువంటి కలుషిత పదార్థాలు కలువడం లేదని సైట్ ఇంజనీర్ రిపోర్ట్ ఇచ్చారని.. శుభ్రమైన త్రాగునీటి సరఫరా హైదరాబాద్ నగరానికి ఎల్లంపల్లి నుంచి సరఫరా చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా ప్రతీ రోజు కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ల నుంచి సేకరించే టన్నుల కొద్దీ కోళ్ల వ్యర్థాలతో చేపల పెంపకాన్ని చేపడుతూ.. 15-20రోజులకు ఒక సారి చేపల చెరువుల్లోని నీటిని గోదావరిఖలోకి వదులుతున్న విషయంపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఎగువన దుర్గం మధ్య పెంచుతున్న చేపల చెరువుల నీళ్లు పైప్ లైన్ల ద్వారా కాలువలో కలిసి, ఆ కాలువ ద్వారా గోదావరిలో కలుస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదనపు కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బొద్దుల గంగయ్య, అంతర్గాం తహసిల్దార్ తూము రవీందర్, మత్య్సశాఖ సహాయ సంచాలకులు నరేష్కుమార్ నాయుడు, నీటిపారుదల శాఖ ఈఈ స్వామి, డీఈ బుచ్చిబాబు, మిషన్ భగీరథ ఈఈ పూర్ణచందర్, హెచ్ఎండబ్ల్యూఎస్ సైట్ ఇంచార్జ్ సతీష్‌లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకుంటారా.. ఒత్తిళ్లకు తలొగ్గుతారా?
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌లోనే యధేచ్చగా చెరువులను తవ్వి అక్రమాలకు తెరతీసిన ఘటనపై నమస్తే తెలంగాణ వరుస కథనాలను ప్రచురించగా.. ఎట్టకేలకు స్పందించిన అధికారులు చర్యలు తీసుకుంటారా..? మళ్లీ అధికార పార్టీ నేతల, ఉన్నతాధికారుల ఒత్తిడులకు తలొగ్గి వదిలేస్తారా? అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో వచ్చి పర్యటిస్తుంటే.. అక్రమార్కులు మాత్రం అక్కడికి చేరుకోకపోవడం వారికి ఉన్న రాజకీయ, అధికారుల అండదండలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. దాదాపుగా 150 ఎకరాల ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని ఆరోపణలు వస్తుండగా అధికారులు మాత్రం 70 ఎకరాలని చెబుతున్నారని, ఏది ఏమైనా.. అక్రమంగా నిర్మించిన అన్ని చెరువులను తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి చెబుతున్నది ఎన్నెకరాలైనా మొత్తం కబ్జాలు మాత్రం పోయి ఇరిగేషన్ భూములు ఇరిగేషన్ శాఖ సొంతం కానున్నాయి.
అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం : పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు
ఎల్లంపల్లి ఎఫ్టీఎల్లో అక్రమంగా చేపల చెరువులను తవ్వారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 70 ఎకరాల్లో ఈ కబ్జాలు జరిగాయి. వాటన్నింటిపై సమగ్రంగా ఇప్పటికే సర్వేలు చేపట్టాం. ఇరిగేషన్ శాఖ ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. చేపల చెరువులను తొలగిస్తాం. ఎవరైతే ఈ అక్రమాలకు తెగబడ్డారో వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తాం.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు