MLC Kavitha | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించింది. ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటే.. మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని.. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలబెట్టడం తప్పా? అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ కాళేశ్వరం అంటూ విమర్శించారు. ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదని.. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌస్‌లు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చునని.. కాళేశ్వరంలో వాడిన స్టీల్‌తో వంద ఈఫిల్ టవర్లు కట్టవచ్చన్నారు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్‌తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చునని తెలిపారు. అంత భారీ ప్రాజెక్టు కాళేశ్వరమని.. ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్‌కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరమని.. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరమని.. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి.. ఎత్తిపోసే ప్రాజెక్టు కేసీఆర్‌దేనన్నారు. గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారని.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదన్నారు.
తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరమని.. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్‌ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారని.. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని.. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌస్ పనులు చేసిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని మండిపడ్డారు. 90 శాతం పంప్‌హౌస్‌ల పనులు చేసిన కాంట్రాక్టర్‌ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదంటూ నిలదీశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని.. గోదావరి – పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జల దోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదన్నారు.
ఎనిమిది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదన్నారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమన్నారు. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలన్నారు. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది? ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తామని హెచ్చరించారు.