Harish Rao | మంచి మార్కులు సాధిస్తే ఐప్యాడ్ గిఫ్ట్‌గా ఇస్తానని పదో తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విజయీభవ ప్రేరణ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ స్థితిని, గతిని మార్చేదే పదో తరగతి అని విద్యార్థులతో అన్నారు. పదో తరగతి మంచి మార్కులతో పాసైతేనే మీ రాత మారుతుందని స్పష్టం చేశారు.
మీ మైండ్‌లో మ్యాటర్ ఉంటే చాలదని.. మీ హ్యాండ్లో పవర్ ఉండాలని పదో తరగతి విద్యార్థులకు హరీశ్‌రావు తెలిపారు. చేతి రాత బాగుండాలని.. అప్పుడే మీ తల రాత బాగుంటుందని పేర్కొన్నారు. మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రమంతా వస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు ఒక ఎత్తు.. మన సిద్దిపేట స్టూడెంట్స్ కు వస్తున్న సీట్లు ఒకెత్తు అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట అన్నింట్లో ఆదర్శంగా ఉంది.. పది ఫలితాల్లో ఫస్ట్ రావాలన్నదే నా తపన అని చెప్పారు. ఈ ఏడాది పది ఫలితాలలో సిద్దిపేటకు మొదటి స్థానం తెచ్చి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు.
ఏకాగ్రతతో చదివితే లక్ష్యాన్ని సాధిస్తామని హరీశ్‌రావు తెలిపారు. నియోజక వర్గం నుంచి 2,875 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయబోతున్నారని పేర్కొన్నారు. నేను నా సొంత ఖర్చులతో ప్రత్యేక తరగతులకు స్నాక్స్ ఏర్పాటు చేయించానని చెప్పారు. ఇంట్లో ఉండి చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇచ్చానని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని చెప్పారు. బాగా చదివి ఆల్ ఇండియా సర్వీస్ లో స్థానం సాధించాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని సూచించారు. సిద్దిపేట నియోజక వర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి టాప్ ర్యాంక్ సాధించిన 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని తెలిపారు.