గంగాధర, జూన్ 4: తాళం వేసిన ఇంటిలో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ కథనం మేరకు.. గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన గడ్డం వీరారెడ్డి గత నెల 31వ తేదీన ఇంటికి తాళం వేసి కరీంనగర్ లోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. మంగళవారం పక్కింటి వారు వీరారెడ్డికి ఫోన్ చేసి ఇంటి తాళం పగలగొట్టి ఉందని, తలుపులు తెరిచి ఉన్నాయని తెలిపారు.
సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు, తలుపుకు వేసిన తాళాన్ని పగలగొట్టి ఉండగా, ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడి ఉన్నాయి. వీరారెడ్డి ఇంట్లో దాచిన రూ.2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. అలాగే లక్ష్మీదేవిపల్లి గ్రామానికే చెందిన కనకట్ల ఎల్లవ్వ ఇంట్లో కూడా దొంగలు పడి రూ. 4 వేలు విలువ గల 2 ఇత్తడి బిందెలు, 2 బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ నాగర్లే , చొప్పదండి సీఐ ప్రదీప్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.