హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు 3-4 వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మున్సిపాలిటీలో వార్డు సభ్యుడి ఎన్నిక విషయమై కేసు దాఖలవడంతో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను నిలిపివేయాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
దీంతో ఆ ఆదేశాలు వెలువడేనాటికే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని, తన ఎంపికను అధికారికంగా ప్రకటించలేదని టేకుల సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టడంతో.. వార్డు కౌన్సిలర్ యాదగిరి అపహరణకు గురయ్యారని ఆయన కుమారుడు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం వల్ల మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల నిలిపివేతకు మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు.
కిడ్నాపైన యాదగిరి కూడా ఎన్నికల్లో పాల్గొన్నారని, హైకోర్టు ఉత్తర్వులు అందేసరికే చైర్మన్ ఎన్నిక పూర్తయినప్పటికీ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదని వివరించారు. ఎన్నికల ఫలితాన్ని వెల్లడించేలా ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆమోదం కోసం లేఖ రాశామని, ఆమోదం లభించగానే ఎన్నిలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల ప్రక్రియను గరిష్ఠంగా 4 వారాల్లో పూర్తిచేయాలని ఎస్ఈసీని ఆదేశించింది.