జగిత్యాల, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటైన నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) ముగిసి నలభై రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎన్టీఏ కనీసం కీ పేపర్, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేయకపోవడంపై విద్యార్థులు, యువతలో తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఏ నీట్ సమయంలో వ్యవహరించినట్లే నెట్లోనూ వ్యవహరించిందా? నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లే నెట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులు గడిచినా కనీసం కీ పేపర్ ఇవ్వకపోవడం వెనుక పెద్ద తప్పిదాలే జరిగి ఉంటాయని ఆరోపిస్తున్నారు.
నెట్ పరీక్ష దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది. జాతీయ స్థాయిలో 87 సబ్జెక్టుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి నెట్ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తారు. దీనికి ఎంపికైన వారు దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా పీహెచ్డీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రీసెర్చ్ చేసే ఐదేండ్ల పాటు నెలకు కనీసం యాభై వేల చొప్పున ఫెలోషిప్‌ను అందిస్తారు.
నీట్ పరీక్ష పత్రాల మాదిరిగానే నెట్ పరీక్ష పత్రాలు సైతం లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత జూన్ 22-30 మధ్య పరీక్షలు పూర్తి చేస్తామని ప్రకటించినా, పంజాబ్‌లోని జలంధర్ పట్టణంలో టెక్నికల్ గ్లిచ్ రావడంతో పొలిటికల్ సైన్స్ పరీక్ష నిర్వహించలేదు. దీంతో జూలై 5న మరోసారి పరీక్షను నిర్వహించారు. అప్పుడే నెట్ పరీక్షలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ నెట్ ప్రశ్న పత్రాలు సైతం లీకయ్యాయంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీక్‌పై ఎన్టీఏపై తొమ్మిదేండ్ల వ్యవధిలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. 2020లో జేఈఈ మెయిన్స్ అస్సామ్ టాపర్స్ స్కామ్‌గా పేరు గాంచింది. ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ నెట్విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.