న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైయిన్లకు ఇవాళ ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ సమన్లు(ACB Summons) జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్‌రూమ్‌ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6వ తేదీన జైయిన్, జూన్ 9వ తేదీన సిసోడియా హాజరుకావాలని ఏసీబీ తన సమన్లలో పేర్కొన్నది. ఏప్రిల్ 30వ తేదీన ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమన్లు ఇచ్చారు. తరగతిగదుల నిర్మాణంలోసుమారు రెండు వేల కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 12 వేల క్లాస్‌రూమ్‌ల నిర్మాణం కోసం ఆ కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
గత ఆప్ ప్రభుత్వ సమయంలో.. ఆర్థిక, విద్యా శాఖలు మంత్రి సిసోడియా వద్దే ఉన్నాయి. సత్యేంద్ర జైయిన్ వద్ద పబ్లిక్ వర్క్స్‌తో పాటు ఇతర శాఖలు ఉన్నాయి. అయితే తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్నది. ఆ ప్రాజెక్టులో అనేక లోపాలు ఉన్నట్లు సీవీసీ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ తెలిపారు. మూడేళ్ల నుంచి ఆ రిపోర్టుపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఏసీబీ సంయుక్త కార్యదిర్శి మదుర్ వర్మ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం రిపోర్టును సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వర్మ వెల్లడించారు.
బీజేపీ నేతల కపిల్ మిశ్ర, హరీశ్ ఖురానా, నీలకంఠ బక్షి. 2019లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని మూడు జోన్లలో జరుగుతున్న క్లాస్‌రూమ్‌ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. 5 లక్షల ఖర్చుతో నిర్మించాల్సిన గదులకు.. సుమారు 25 లక్షలు ఖర్చు చేసినట్లు రిపోర్టు ద్వారా తెలిసింది. ఈ అక్రమాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది.