ఆసియా బ్యాంకుల్లో గుబులు మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కల్లోలం సృష్టిస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలకు అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఇప్పుడు భయాందోళనలు నెలకొన్నాయి. చైనాతోపాటు వివిధ ఆసియా దేశాల్లోని ప్రధాన బ్యాంకులు ఆయా గల్ఫ్ దేశాలకు లక్షల కోట్ల రూపాయల రుణాలిచ్చాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 15 బిలియన్ డాలర్లకుపైగా రుణాలివ్వగా.. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది మూడింతలు పెరుగడం గమనార్హం.
సౌదీ, యూఏఈలకే..
చైనా సహా, ఇతర ఆసియా దేశాల బ్యాంకులు ఎక్కువగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లకే లోన్లు ఇచ్చాయని బ్లూంబర్గ్ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌కి అప్పులిచ్చేందుకు బ్యాంకర్లు గత కొన్నేండ్లుగా క్యూ కడుతున్నారంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఒకప్పుడు కేవలం ముడి చమురు ఉత్పత్తి ద్వారానే ఆదాయం సమకూర్చుకున్న యూఏఈ.. ఇప్పుడు పర్యాటక, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల కల్పనకు యూఏఈ పాలకులు పెద్దపీట వేస్తున్నారు.
దీనికి భారీగా నిధులు కావాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు బాండ్లు, ఇతరత్రా మార్గాల ద్వారా రుణాల సేకరణ చేస్తున్నాయి. అయితే అమెరికాకు మద్దతిస్తున్నాయన్న కోపంతో ఇరాన్.. సౌదీ, దుబాయ్, బహ్రెయిన్ తదితర దేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రమాదంలో పడేస్తున్నది. దీంతో అప్పులిచ్చిన బ్యాంకులు బిక్కుబిక్కుమంటున్నాయి. గల్ఫ్ దేశాలకు ఆసియా బ్యాంకులు నేరుగానేగాక, ఆయా దేశాల్లోని ఇన్వెస్టర్లు, కంపెనీల ద్వారా కూడా రుణాలిచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ రిస్క్‌లో పడ్డట్టే కనిపిస్తున్నాయి. మొత్తానికి యుద్ధం ఇలాగే కొనసాగితే బ్యాంకింగ్ రంగంలో పెను సంక్షోభం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.