Apiculture | జగిత్యాల టౌన్, మార్చి 30 : ఒకప్పుడు అడవుల్లో, భారీ చెట్ల వద్ద మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతున్నది. కేవలం ఆంధ్ర, ఇతర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెంపకం తెలంగాణకు క్రమంగా విస్తరిస్తున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఈ ‘బీ కీపింగ్’ (తేనెటీగల పెంపకం) కాసుల వర్షం కురిపిస్తున్నది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి.. అనువైన స్థలంలో మొదలుపెడితే క్రమం తప్పకుండా మంచి ఆదాయం ఇవ్వడం ప్రత్యేకత కాగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే పలువురు రైతులు రాణిస్తున్నారు. ప్రత్యేకంగా 50వేల తేనెటీగలతో కూడిన బాక్కులను కొనుగోలు చేసి తీసుకువస్తూ, ఉద్యానవన పంట క్షేత్రాల వద్ద అమరుస్తూ ఉపాధి పొందుతున్నారు. ఓ వైపు జీవ వైవిద్యాన్ని, పర్యావరణాన్ని జీవవంతం చేస్తూ ఉపాధి పొందుతూనే.. మరో వైపు పంటలకు ప్రాణం పోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తేనెటీగలను బాక్స్‌ల్లో పెంచుతారు. ఒక్కో బాక్స్‌లో మైనం షీట్స్ కలిగిన 8-10ఫ్రేంలు ఉంటాయి. వాటిల్లోనే తేనెటీగలు ఉంటాయి. బయటికి వెళ్లడానికి, రావడానికి బాక్సు నుంచి ఒకే దారి ఉంటుంది. బాక్స్ మూత తీసినా ఆ వైపు నుంచి తేనెటీగలు లేచి పోవు. మొత్తంగా ఒక బాక్స్‌లో 50వేల నుంచి లక్ష తేనెటీగలు ఉంటాయి. ఇందులో ఒక రాణి( పరిపూర్ణమైన ఆడ ఈగ, క్వీన్‌బీ అంటారు). వేల సంఖ్యలో కూలీ ఈగలు (అసంపూర్ణమైన ఆడ ఈగలు), వందల సంఖ్యలో మగ ఈగ(వీటిని డ్రోన్స్ అంటారు)లు ఉంటాయి. ఇవి రాణి ఈగ డైరెక్షన్లో పనిచేస్తాయి. మరికొన్ని ఈగలు పూలు, పూతపై ఉండే ఎంజెమ్స్ని, పుప్పొడిని, మరికొన్ని మకరందాన్ని, బంకపై ఉండే మైనాన్ని తెస్తాయి. మరికొన్ని ఈగలు రాణి ఈగ కోసం రాజాహారం(రాయల్ జెల్లీ)ని తీసుకొస్తాయి. ఇక బాక్స్‌లో ఉండే ఈగలు మైనంతో గదులను చక్కగా నిర్మిస్తుంటాయి. ఇక మకరందాన్ని తెచ్చిన తీగలు దానిని తేనేగా మార్చి గదుల్లో నింపి సీల్ చేస్తాయి. ఇక బాక్స్‌లో చనిపోయి ఉన్న ఈగలను మరికొన్ని ఈగలు బయటకు పడేస్తూ ఉంటాయి. బాక్స్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి కొండ ఈగలు, దోమలు, ఈగలు, బల్లులురాకుండా ఒక 15-20 ఈగలు కాపలా కాస్తుంటాయి.
Apiculture2
Apiculture1
తేనెటీగల పెంపకం రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఉద్యానవన పంటలైన నువ్వులు, ఆవాలు, కుసుమ, కంది పంట చేలల్లో తేనెటీగల పెట్టెలను అమర్చుకొని అధిక లాభాలు సేకరించవచ్చు. ఒక ఎకరం పంటలో సుమారు ఐదు బాక్సులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బాక్సు నుంచి 4 కేజీల తేనె వస్తుంది. ఒక ఎకరా పంటలో 5 బాక్సులు అమర్చినట్లయితే 20 కిలోల తేనెను సేకరించవచ్చు. ప్రస్తుతం స్వచ్ఛమైన తేనె కిలోకు 450 నుంచి 500 పలుకుతుండగా, ఈ లెక్కన 20 కిలోల తేనెకు 9వేల నుంచి 10వేల ఆదాయం పొందవచ్చు. కాగా, మార్కెట్లో తేనెటీగల బాక్సు ధర 7500 ఉంటుంది. ఒక్కో బాక్సులో 50 వేల నుంచి లక్ష దాకా తేనెటీగలు ఉంటాయి.
తేనె టీగల పెంపకంతో బహుళ ప్రయోజనాలున్నాయి. నిర్వహకులకు తక్కువ పెట్టుబడికే ఎక్కువ లాభాలు కండ్లచూడవచ్చు. సంవత్సరం పొడవునా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా వీటిని పెంచవచ్చు. ఇక స్థానికంగా తక్కువ ధరకే స్వచ్ఛమైన, నాణ్యమైన తేనె వినియోగదారులకు దొరుకుతుంది. తేనెటీగలు అంతరించిపోకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. పండ్ల, పూల తోటల్లో, కూరగాయల సాగులో రైతులకు అధిక దిగుబడి సాధించడానికి తేనెటీగలు దోహదపడతాయి. పంట పొలాల్లో తేనె టీగలు ఉండడం వల్ల పరాగ సంపర్కం జరిగి సాధారణంగా వచ్చే దిగుబడికన్నా 40శాతం వరకు అధిక దిగుబడులు వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన పలువురు రైతులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, బాపట్ల నుంచి తేనెటీగలతో ఉన్న ఒక్కో బాక్సును నెలకు రూ.2వేల చొప్పున అద్దెకు తెచ్చుకొని పంట పొలాల వద్ద పెట్టుకుంటున్నారు. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన పలువురు రైతులు బాక్సులను అద్దెకు తీసుకొని వచ్చి పెట్టుకున్నారు.
Apiculture3
మన ప్రాంతంలోని రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన లేకపోవడంతో ఎంతో నష్టపోతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి మన రైతులు సాగు చేస్తున్న ఆవాలు, నువ్వులు లాంటి పంట పొలాల్లో తేనెటీగల పెట్టెలను పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నారు. పెట్టెలను అమర్చడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందని చెబుతుండడంతో రైతులూ ఒకే చెప్పేస్తున్నారు. కానీ దాని వల్ల వచ్చే లాభాలను మాత్రం గుర్తించలేకపోతున్నారు. దీనిని గుర్తించిన పొలాస పరిశోధనా స్థానం తేనెటీగల పెంపకం వైపు రైతులను ప్రోత్సహిస్తున్నది.
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులను వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో రాణించేలా పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషిచేస్తున్నది. అందులో ప్రధానంగా మార్కెట్లో అధిక డిమాండ్ పలుకుతూ, తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఆదాయాన్నిచ్చే తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో తేనె టీగల పెంపకంపై పరిశోధనా స్థానంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. పెంపకం, వాటి పరిశ్రమ ఏర్పాటుకు కావల్సిన సలహాలు, సూచనలు ఒక్కో రైతుకు వారంపాటు శిక్షణ ఇస్తున్నది. వారం రోజులపాటు ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు తేనె సేకరించేందుకు కావాల్సిన తేనెటీగల పెట్టెలను అందిస్తున్నది. అంతేకాదు పరిశోధనా స్థానంలోనే ప్రయోగాత్మకంగా బాక్సుల్లో బీ కీపింగ్ చేస్తూ వాటిని రైతులకు చూపిస్తూ తేనె ఎలా తయారుచేయవచ్చో అర్థమయ్యేలా వివరిస్తున్నది.
ఎడమల మల్లారెడ్డి ( ఎడమ )
నాకు ఏడెకరాల భూమి ఉంది. అందులో రెండెకరాలల్ల మామిడి తోట పోను ఐదెకరాల్లో నువ్వు, ఆవాలు, కంది సాగుచేస్తున్న. నేను గతేడాది హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో తేనెటీగల పెంపకంపై ఎనిమిది రోజుల శిక్షణ తీసుకున్నా. ఒక్కో బాక్సులో 50 వేల నుంచి లక్ష తేనెటీగలు ఉండే బాక్కులను 40 కొనుగోలు చేసిన. ఒక్కో బాక్సు ధర రూ.7500 పడ్డది. నా వ్యవసాయ క్షేత్రంలో బాక్సులను పెట్టిన. నెలకు 30-40 కిలోల తేనె తయారైతున్నది. కిలోకు రూ.450 చొప్పున అమ్ముతున్నా. నెలకు రూ.18 వేలపైనే ఆదాయం వస్తోంది. ఇంకా ఈ తేనెటీగల పెంపకం చేపట్టినప్పటి నుంచి నా పంటల దిగుబడి బాగా వస్తోంది. నేను తయారు చేసే తేనెకు మార్కెట్లో డిమాండ్ బాగుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచి వచ్చి కొనుక్కెళ్తారు. వీలుగాని వారికి కొరియర్ ద్వారా పంపిస్తున్నా. నా కస్టమర్ల నంబర్లతో వాట్సప్ గ్రూప్ కూడా తయారు చేసిన.
– ఎడమల మల్లారెడ్డి, రైతు, లక్ష్మీపూర్ (జగిత్యాల మండలం)
తేనె వినియోగం బాగా పెరిగింది. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగడం లేదు. అందుకే ఈ తేనె టీగల పెంపకాన్ని చేపట్టిన రైతులకు అధిక లాభాలుంటాయి. ప్రభుత్వం కూడా తేనె ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది. ఆవాలు, నువ్వులు, మినుములు వంటి పంటలు వేసే రైతులు తమ తోటల్లో బాక్సులను ఏర్పాటు చేసుకుంటే అదనపు ఆదాయం పొందవచ్చు. తేనె దిగుబడితోపాటు ఇంకా పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ వీ ప్రభాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రికల్చర్ కళాశాల (పొలాస)