కోరుట్ల నవంబర్ 19 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాము పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులకు అందిస్తున్న బోధన సరళిని విద్యార్థుల ప్రగతిని, పాఠశాల రికార్డుల రిజిస్టర్, విద్యార్థుల హాజరు శాతాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన కొద్దిసేపు తరగతి గదిలో పాఠాలు విన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిత్యం పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని, బడికి రానీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేష్, ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు, సిఆర్పిటి సత్యనారాయణ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.