Gold Theft | ధర్మపురి, జూలై 31 : పంచాయతీ కార్యదర్శినంటూ మాట కలిపిన ఓ కేటుగాడు పింఛన్ ఇస్తానని చెప్పి ఓ వృద్ధురాలి మెడలో నుంచి రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో జరిగింది. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన అయ్యోరి పోచమ్మ అనే వృద్ధురాలు గురువారం గోదావరి స్నానానికి ఆర్టీసీ బస్లో ధర్మపురికి వచ్చింది.
అయితే ధర్మపురిలో బస్ దిగాక పోచమ్మ గోదావరి వరకు ఆటో కావాలని అక్కడున్న ఆటోవాలాల్ని అడిగింది. రూ.50 కిరాయి అనడంతో ఎక్కువ అనుకొని నడిచి వెలదామని బయలుదేరింది. అయితే వృద్ధురాలి వెనకాలే ఫాలో అవుతున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి వృద్ధురాలితో మాట కలిపాడు.
నేను నేరెళ్ల పంచాయతీ కార్యదర్శినంటూ..
” అమ్మా.. నీ పేరు అయ్యోరి పోచమ్మ, నేరెళ్ల గ్రామం కదా..? నేను నేరెళ్ల పంచాయతీ కార్యదర్శిని ఉంటూ మాట కలిపాడు. ఈ నెల పింఛన్ తీసుకున్నావా..? అని అడిగాడు. వృద్ధాప్య పింఛన్ బ్యాంకులో జమ అవుతున్నప్పటికీ ఈ సారి చేతిద్వారా ఇస్తారేమోనని భావించిన వృద్ధురాలు ఇంకా పింఛన్ రాలేదని ఆ వ్యక్తికి చెప్పింది. ఇప్పటివరకు నేరెళ్లలో పింఛన్ పంచి వస్తున్నానని, నీ పింఛన్ కూడా ఇస్తానని చెప్పి వృద్ధురాలిని బస్టాండ్ సమీపంలోని ఆంగ్లోవేదిక్ స్కూల్ సందిలోకి తీసుకెళ్లాడు. పింఛన్ తీసుకోవాలంటే రెండుకాగితాలు జిరాక్స్ తీసుకురావాలని, ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని పింఛన్ డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు.
ఏవేవో రెండు కాగితాలు వృద్దురాలి చేతిలో పెట్టి జిరాక్స్ తేవాలన్నాడు. అదే సమయంలో నీ మెడలో పుస్తెల తాడు ఇవ్వాలని.. మరో వృద్దురాలిని కూడా ఫొటో తీసుకొని పింఛన్ ఇవ్వాలని, ఆమె పుస్తెలతాడు మరచి వచ్చిందని ఫోటో తీసుకునే వరకు పుస్తెల తాడు ఇవ్వాలని నమ్మించడంతో వృద్ధురాలు పుస్తెల తాడును తానే స్వయంగా తీసి దుండగుడి చేతిలో పెట్టి జిరాక్స్ కోసం తూర్పు దిశకు వెళ్లగా, ఆ కేటుగాడు పడమర దిశగా వెళ్లాడు.
ఇదంతా ఈ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే వృద్ధురాలు వెళ్లిన ప్రదేశంలో జిరాక్స్ సెంటర్లు ఎక్కడా లేకపోవడంతో వృద్ధురాలు తిరిగి స్కూల్ సందిలోకి చేరుకున్నది. అప్పటికే బంగారు పుస్తెల తాడుతో సదరు దుండగుడు ఉడాయించాడు. మోసపోయానని గుర్తించిన వృద్ధురాలు భోరున విలపించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
అయితే పుస్తెలతాడు అపహరించిన దుండగుడు వృద్ధురాలు ప్రయాణించిన బస్నే ప్రయాణించి ఉంటాడని.. బస్ పక్క సీట్లోనో, వెనుక సీట్లోనో కూర్చొని ఆధార్ కార్డులో ఉన్న వృద్ధురాలి పేరును, వివరాలను గమనించి ధర్మపురిలో బస్ దిగిన వృద్ధురాలిని ప్లాన్ ప్రకారమే ఫాలో అయి పుస్తెలతాడు అపహరించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్దురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస