Minority Gurukuls | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13 : కరీంనగర్ జిల్లాలో మైనార్టీ గురుకులాల పరిస్థితి గతమెంతో ఘనం… ప్రస్తుతం అవినీతిమయం అన్నట్లుగా మారింది. విద్యార్థులకందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతుండగా, గురుకుల బోధన నామమాత్రమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యాసంస్థలను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు తమకున్న రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, మైనారిటీ విద్యాసంస్థలు భ్రష్టు పడుతున్నాయనే విమర్శలు కోకొల్లలుగా వస్తున్నాయి. వీటిలో జరుగుతున్న అవినీతి అక్రమాల తంతుపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళుతున్నా, క్షేత్ర స్థాయిలో కనీస విచారణ చేయకుండా, పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తుండగా జిల్లాలోని పలు మైనారిటీ గురుకులాల్లో కొంతమంది పర్యవేక్షకులు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా విధులు నిర్వహిస్తున్నారని ఆయా గురుకులాల్లోని సిబ్బంది మండి పడుతున్నారు. తనిఖీలకు వెళ్లి వాస్తవాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా, కనీస చర్యలు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
తనిఖీలు చేపట్టే అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమకున్న రాజకీయ పలుకుబడితో సదరు అధికారులే బెదిరింపులకు పాల్పడుతూ, గురుకుల వ్యవస్థకు కొత్త భాష్యం చెబుతున్నారనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. నిబద్ధతతో విధులు నిర్వహించే అధికారులను నయానో భయానో తమ వైపుకు తిప్పుకోవడం, వినకపోతే శల్య పరీక్షలు పెడుతున్నారంటూ అధికారుల ఎదుట బోరుమంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిచ్చే సానుభూతితో మరింత రెచ్చిపోతూ, గురుకుల వ్యవస్థకు గుదిబండగా మారుతున్నారనే ఆరోపణల వెల్లువ కొనసాగుతున్నది.
అల్ప సంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగు రేఖలు నింపే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మైనార్టీ గురుకుల విద్యాసంస్థను ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా గురుకులాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, సరైన ప్రణాళికతో ముందుకు నడిపించింది. దీంతో అంతంత మాత్రంగానే ఉన్న మైనారిటీల్లో విద్య శాతం ఏటేటా పెరుగుతుండగా, గత మూడేళ్లుగా ఆ కుటుంబాల్లో ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది.
ఇళ్లలో జరిగే విందు, వినోద కార్యక్రమాలకూ..
తమ కుటుంబాల్లో ఆర్థిక ఎదుగుదల ప్రక్రియ మొదలైందనే సంతోషం వారిలో కనిపిస్తున్నది. వారిని చూసి అల్ప సంఖ్యాక వర్గాల్లోని మిగతా వారు కూడా తమ పిల్లలను మైనారిటీ గురుకులాల్లో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడంతో, కంచె చేను మేసినట్లుగా మైనార్టీ గురుకుల వ్యవస్థ తయారైందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. అల్పసంఖ్యాక విద్యార్థులకు కేటాయించిన కోటాలో వారిని చేర్చుకోకుండా.. సీట్లు భర్తీ అయ్యాయి అని చెబుతూ నాన్ మైనార్టీలకు విక్రయించుకోవటం, విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా అందించాల్సిన పాలు బహిరంగ మార్కెట్లో సిబ్బందితో విక్రయించటం, ముక్కిన బియ్యం వేలం పేర నేరుగా అమ్మకాలు జరపటం, తమ ఇళ్లలో జరిగే విందు, వినోద కార్యక్రమాలకు కూడా గురుకులాల్లోని నిత్యావసరాలు వినియోగిస్తుండటం, విద్యాసంస్థల్లో చేపట్టే మరమ్మత్తుల పేర వేల నుంచి లక్షల రూపాయల బిల్లులు పెట్టడం లాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నారనే విమర్శలు సాధారణమయ్యాయి.
వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే అవసరమైన కార్యనిర్వహణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముక్కిన బియ్యం విక్రయించాలంటే, ముందుగా తమ వద్ద నిల్వ ఉన్న బియ్యం వివరాలను విద్యాసంస్థల పర్యవేక్షనాధి కారులకు సమాచారం ఇవ్వాలి. సంబంధిత అధికారులు రెవెన్యూ యంత్రాంగానికి, వారు పౌరసరఫరాల శాఖ సిబ్బందికి వివరాలు అందజేస్తే, వాటిని పరిశీలించి వేలం వేస్తారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా బియ్యం విక్రయాలు జరపటం, ఆ వచ్చిన మొత్తం లెక్కల్లో చూపకపోవటం జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో సర్వ సాధారణంగా మారిందనే సిబ్బందిలో చర్చ నడుస్తున్నది.
పిల్లలకు బలవంతంగా టీసీలు ఇచ్చి..
జిల్లా పరిధిలో మొత్తం 9 మైనారిటీ గురుకులాలు కొనసాగుతుండగా, కొన్నింటిలో జరుగుతున్న అక్రమాలపై విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాసంస్థల పర్యవేక్షకులను ప్రశ్నిస్తే, వారిని సైతం బెదిరింపులకు గురి చేయటం, వారి పిల్లలకు బలవంతంగా టీసీలు ఇచ్చి బయటకు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ కోసం ఏటేటా లక్షలాది రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్న సౌకర్యాలు కానరాకపోవటం, నామమాత్రమైన పర్యవేక్షణ మాత్రమే కొనసాగుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ఉదాత్తాశయంతో ప్రారంభించి నిర్వహిస్తున్న జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి నిష్పక్షపాతంగా విచారణ జరిపితే తప్ప, నిరాటంకంగా సాగుతున్న అక్రమాల తంతుకు పడే అవకాశాలు లేవని, సంస్థల సిబ్బందే పేర్కొంటుండటం గమనార్హం. అధికారులు ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!