Tragedy | ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కూతుర్నే పొట్టనపెట్టుకుంది. రెండేళ్ల చిన్నారి అనే కనికరం లేకుండా ఆమెను దారుణంగా చంపి పాతిపెట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి ఊరు విడిచివెళ్లిపోయింది. అయితే తన భార్య కనిపించడం లేదని భర్త ఇచ్చిన ఫిర్యాదుతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలించగా.. దాదాపు మూడు నెలల తర్వాత ఈ దారుణ విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లికి చెందిన మమత (22)కు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మమతకు అదే గ్రామానికి చెందిన ఫయీజ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో మే 27వ తేదీ నుంచి తన కుమార్తె తనుశ్రీతో కలిసివెళ్లిపోయింది. దీంతో తన భార్య, రెండేళ్ల కుమార్తె కనిపించడం లేదని ఆమె భర్త భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మమత, తనుశ్రీ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారి ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుంటూరులో మమత, ఫయీజ్ (30)ని తాజాగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని రెండేళ్ల కుమార్తె గురించి ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. తమ బంధానికి అడ్డుగా ఉందని తనుశ్రీని హత్య చేసి శభాష్‌పల్లి శివారులో పాతిపెట్టామని చెప్పారు. కాగా, మమతను శివ్వంపల్లికి తీసుకొచ్చి, ఆమె చూపిన చోట తవ్వగా.. కుళ్లిన స్థితిలో చిన్నారి మృతదేహం దొరికింది. దీంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.