Serp | కరీంనగర్ కలెక్టరేట్, జులై 10 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) లో కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీలు ఇంకెన్నాళ్లో అనే చర్చ నడుస్తుంది. ఏడాది కిందట మొదలైన ఈ ప్రక్రియ ప్రహసనంగా మారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. వంద శాతం బదిలీల పేర నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఎల్ 5, ఎల్ 4 అధికారులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. ఎల్ 3 కేటగిరీకి ఆప్సన్స్ అవకాశమిచ్చినా, మిగతావారికి ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయకపోవడంతో బదిలీలకు ఇంకెంతకాలం పడుతుందోననే అసహనం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టగానే ఈ శాఖలో బదిలీల అంశం తెరపైకి రాగా, గత మే నెలలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అనంతరం సెర్ఫ్ సీఈఓ బదిలీల నోటిఫికేషన్ వెలువరించింది. ఆ వెంటనే అన్ని కేటగిరీలకు కౌన్సెలింగ్ చేపట్టి , బదిలీ ఉత్తర్వులు కూడా అందజేయాల్సి ఉండగా, కేవలం అదనపు పీడీలు, డీపీఎంలకు మాత్రమే నిర్వహించి, ప్రాధాన్యత క్రమంలో ఆయా జిల్లాల్లో స్థానచలనం కల్పించారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లకు కౌన్సెలింగ్ జరిపినా ఇప్పటివరకు బదిలీ ఉత్తర్వులు అందజేయలేదు. వంద శాతం బదిలీలే లక్ష్యంగా నోటిఫికేషన్ వెలువరించినా, ఇంకా ఎల్ 2, ఎల్ 1, ఎంఎస్సీసీలకు సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ప్రారంభించనే లేదు. దీంతో బదిలీల్లో తమకు అనుకూలమైన స్థానం కోసం సంబంధిత సిబ్బంది పైరవీలు చేసుకోవటమే తప్ప, చేయాల్సిన విధులపై దృష్టి సారించటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్వ స్థానాలకు తిరిగి వచ్చేందుకు డీపీఎంల ప్రయత్నాలు :
ఏళ్లకేల్లుగా తిష్ట వేసి తమకంటూ కోటరీలు ఏర్పాటు చేసుకున్న కొంతమంది డీపీఎంలు తాము గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగంతో పాటు సైడ్ బిజినెస్లు కూడా చేస్తూ, రెండు చేతులా సంపాదనకు అలవాటు పడి ప్రస్తుతం బదిలీ అయిన స్థానంలో విధులు నిర్వహించేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారి నెలల తరబడి కొనసాగుతుండగా, సందట్లో సడేమియాల పూర్వ స్థానాలకు తిరిగి వచ్చేందుకు అధికార నాయకుల ద్వారా సెర్ఫ్ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో బదిలీ అయిన వారిలో పదిమందికి పైగా వేర్వేరు వ్యాపారాలు చేస్తూ, విధుల నిర్వహణపై నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరంతా, పొద్దంతా కార్యాలయాల్లో, రాత్రి పూట రాజకీయ నాయకుల ఇళ్ల ఎదుట పడిగాపులు కాస్తున్నట్లు సెర్ఫ్ సిబ్బందే పేర్కొంటున్నారు. వీరి ప్రదక్షిణలు చూడలేక మా వాళ్లు మీ వద్దకొస్తున్నారు. కొంచెం చూడండి.. వారిని పాత చోటుకు మళ్లీ పంపండి అంటూ అధికారులకు ఫోన్లు చేసి చెబుతున్నట్లు తెలుస్తుంది. అధికారులు చేస్తున్న జాప్యంతోనే బదిలీల్లో అక్రమాలకు ఆస్కారమేర్పడే అవకాశాలు పెరుగుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్