Ntpc | గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారాన్ని ముగించాయి. బుధవారం ఎలాంటి ప్రచారం లేనప్పటికీ ఓటర్లను ఆకర్షించడానికి ప్రలోభాలు మొదలయ్యాయి. 25న ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తుంది. రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగిగా పనిచేసి గతంలో బీఎంఎస్కు నాయకత్వం వహించిన వడ్డేపల్లి రామచందర్ ప్రస్తుతం కీలకమైన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా క్యాబినెట్ హోదాలో కొనసాగుతుండడంతో అతని అనుచరులు బీఎంఎస్ ను ఎన్టీపీసీలో గెలిపించి అతనికి గిఫ్ట్ గా ఇవ్వాలని తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఇప్పటికే రెండు పర్యాయాలు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడు ఎన్ బీ సీ మెంబర్ బాబర్ సలీం పాషా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు 2027 లో వేతన సవరణ ఉండడం అందులో మెరుగైన వేతనాలను ఇప్పిస్తామని ఐఎన్టీయూసీ, బీఎంఎస్ లు, కార్మికులకు వాగ్ధానం చేస్తున్నాయి. కార్మికులకు ఇప్పటికే పీఆర్పీని తామే ఇప్పించామని రెండు సంఘాలు చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. పీఆర్పీ ద్వారా ప్రతీ కార్మికుడికి అధికారులతో సమానంగా కార్మికులకు 4 లక్షలకు పైగా లబ్ధి చేకూరే విధంగా తాము కృషి చేశామని బీఎంఎస్, ఐఎన్టీయూసీలు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు.
వాస్తవానికి పీఆర్సీని, ఐఎన్టీయూసీ, సీఐటీయూలు వ్యతిరేకించాయని బీఎంఎస్ గట్టిగా వాదిస్తుండగా ఐఎన్టీయూసీ మాత్రం తమ కృషి వల్లనే పీఆర్సీ అమలైందని పేర్కొంటున్నారు. రామగుండం ఎన్టీపీసీలో సెప్టెంబర్ 2022 లో జరిగిన ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసిన ఐఎన్టియూసీ వేటిని అమలు చేయలేదని బీఎంఎస్ ప్రచారం చేస్తూ కరపత్రాలను విడుదల చేసింది. వరుసగా ఆరు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐఎన్టీయూసీ నాయకుడు బాబర్ సలీం పాషా మరోసారి కార్మికులను మోసం చేసి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని బీఎంఎస్ ఆరోపిస్తూ ప్రచారం చేసింది.
ఇదిలా ఉంటే ఐఎన్టీయూసీ మాత్రం మరోసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో ప్రధానంగా 2027లో జరిగే వేతన సవరణ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్లు ఇతర అంశాలపైనే దృష్టి సారిస్తూ ప్రచారం సాగింది. మొత్తం 220 ఓట్లు ఉన్నా రామగుండం ఎన్టీపీసీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని యజమాన్యం నిర్ణయించింది. దీంతో అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో సీఐటీయూ పోటీలో ఉన్నప్పటికీ వారికి పెద్దగా క్యాడర్ లేకపోవడం నామమాత్రంగానే సీఐటీయూ పోటీపడే అవకాశాలు కనిపిస్తుంది.