Union cabinet : ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగితే ఆ రాష్ట్రంలో ఓట్ల కోసం వరాలు కురిపించడం కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) సర్కారుకు రివాజుగా మారింది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) వేళ కూడా కేంద్రం అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. ఆ రాష్ట్రంలో సుమారు రూ.6 వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి (Union Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియాకు వెల్లడించారు.
రైల్వేకు సంబంధించి బీహార్లో రూ.2,192 కోట్లతో భక్తియార్పుర్-రాజ్గిర్-తిలయ్యా డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సాహెబ్గంజ్-అరెరాజ్-బెతియా మధ్య రూ.3,822 కోట్లతో 78.9 కిలోమీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుతో రాజధాని పట్నా-బెతియా మధ్య కనెక్టివిటీ మెరుగు పడుతుందని పేర్కొంది. వీటితోపాటు దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5 వేల పీజీ సీట్లకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం (CSS) మూడో ఫేజ్ కింద 2028-29 నాటికి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనుంది.