korutla | కోరుట్ల, సెప్టెంబర్ 24: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు.
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుందని తెలిపారు. కాగా వైద్య శిబిరంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది, చిన్నారులు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్జున్, గైనకాలజిస్ట్ డాక్టర్ రూహి మంజూర్, జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ఇమిథ్యాజ్, జనరల్ సర్జరీ నిపుణులు డాక్టర్ అచ్యుత్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రాధా రాణి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మజీద్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.