Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన సరస్వతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిన్నారులపై జరిగే అత్యాచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు సమాజానికి పెద్ద ప్రమాదంగా మారుతున్నాయని ఆమె అన్నారు. అలాంటి నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “చిన్న పిల్లలను హరాస్ చేసే వాళ్లను, అత్యాచారం చేసే వాళ్లను అసలు వదిలిపెట్టకూడదు. వాళ్లకు సాధారణంగా మరణశిక్ష ఇవ్వడం సరిపోదు. అలాంటి వాళ్లకు మరింత కఠినమైన శిక్షలు ఉండాలి, కట్ చేసి పడేయాలి” అని వరలక్ష్మి పేర్కొన్నారు.
నేను ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే రేప్ లాంటి నేరాలకు పాల్పడే అబ్బాయిలకు కఠినమైన శిక్ష విధించేలా ప్రత్యేక చట్టం తీసుకువస్తాను. అప్పుడు అలాంటి నేరాలు చేయడానికి కూడా వాళ్లు భయపడతారు. సమాజంలో ఆ భయం రావాలి అని ఆమె అన్నారు. అదే సమయంలో పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని వరలక్ష్మి సూచించారు. చిన్నారులకు చిన్నప్పటి నుంచే ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలకు ధైర్యం ఇవ్వడం, ఏదైనా తప్పు జరిగితే చెప్పేలా వారికి నమ్మకం కల్పించడం ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సరస్వతి సినిమా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో రూపొందిన సామాజిక అంశాలతో కూడిన చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాతో ఆమె దర్శకురాలిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.