రామగిరి, సెప్టెంబర్ 24 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల, యశోద హాస్పిటల్ -మలక్పేట సహకారంతో కళాశాలలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. స్వీయ క్రమశిక్షణ, ఆరోగ్య సంరక్షణ దేశ సేవలో భాగమే అన్నారు. ఆరోగ్యంగా ఉండడమే మీ కుటుంబానికి, దేశానికి అతి పెద్ద బహుమతి అని తెలిపారు. వైద్య శిబిరంలో ఉచిత జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియాలజీ సంబంధించిన, అదేవిధంగా రక్త పరీక్ష, షుగర్, ఈసీజీ, 2D-ఇకో లాంటి టెస్టులను నిర్వహించారు. యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్ సాగర్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి పసుపుల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.