కోదాడ, మార్చి 03 : రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమకారులకు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడు గుండెపంగు రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం కోసం జిల్లాలో ఎంతోమంది ఉద్యమకారులు జైలు జీవితం గడిపారని వారి సంక్షేమం కోసం ఈ ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. డాక్టర్ శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. ఉద్యమ కాలంలో జిల్లా వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హామీలు నెరవేర్చేంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ నాయకులు మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, తోటపల్లి నాగరాజు రావు, ఆవుల రామారావు, అంజయ్య, కుడుముల రాంబాబు, యేసు, రవి శంకర్, రాజు పాల్గొన్నారు.