హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కేటీఆర్ వరుస పర్యటనలతో ఉలిక్కిపడిన బీజేపీ ఎంపీలు ఇక కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. గత నెల 15న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కేటీఆర్ కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన బీజేపీ ఎంపీలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి.. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కోరడం గమనార్హం. మరోవైపు కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేటీఆర్ కలిశారు. తెలంగాణలో ఐటీ రంగం, రైల్వే ప్రాజెక్టుల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ మధ్య రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తున్నందున కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కేటీఆర్ కలిసిన కేంద్ర మంత్రులను బీజేపీ ఎంపీలు కలిసి అవే విజ్ఞప్తులు చేయడం గమనార్హం.