‘నేను ఇంత పెద్ద సినిమా ఎప్పుడూ చేయలేదు. దర్శకనిర్మాతలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని శాయశక్తుల కృషి చేశాను’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. నాని తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’లో బిర్యానీ అనే ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నారు సంపూర్ణేష్‌బాబు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం సంపూర్ణేష్‌బాబు విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఈ సినిమాలో తాను నాని ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపిస్తానని, కథాగమనంలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ ‘మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే నా కెరీర్లో కొన్ని మిస్టేక్స్ జరిగేవి కావు. నానిగారితో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా’ అన్నారు. ఈ సినిమా కోసం తాను బరువు తగ్గానని, జుట్టు..గడ్డం కూడా పెంచానని సంపూర్ణేష్‌బాబు పేర్కొన్నారు. ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమా అంతే అద్భుతంగా ఉంటుందని, రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నానని సంపూర్ణేష్‌బాబు తెలిపారు.