కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 5: సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ (జేఎంఈటీ)లోచేరిన 600 మంది ఉద్యోగులకు ఓవర్మెన్లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట ఉద్యోగులు బుధవారం 72 గంటల నిరసన దీక్షలకు పూనుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. 2016-17లో విధుల్లో చేరిన 800 మందికి 2023 వరకు ఓవర్మెన్లుగా ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. అయితే, వారిలో కేవలం 200 మందికి మాత్రమే ప్రమోషన్లు కల్పించారని, మిగిలిన 600 మందికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమోషన్ల గురించి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. బదిలీల పేరుతో వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 72 గంటల నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. అర్హతల ఆధారంగా ఓవర్మెన్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. కాగా.. జేఎంఈటీల దీక్షలకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. జేఎంఈటీల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని, వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.