హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయమైన జేఎన్టీయూహెచ్లో పరిస్థితి నానాటికి దిగజారుతున్నది. బుధవారం వరకు వర్సిటీలోని రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ విషయం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి నెలా రెగ్యులర్ ఉద్యోగుల జీతాల కోసం రూ. 12 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉన్నది. గత నెల ఒకటో తేదీనే జీతాలు జమ కాగా, ఈసారి ఐదో తేదీ దాటినా జమ కాకపోవడంతో అంతా చర్చించుకోవడం కనిపించింది. ఓయూ, పాలమూరు, శాతవాహన, ఇతర వర్సిటీలకు జీతాలు జమ కాగా, జేఎన్టీయూకు మాత్రం అందకపోవడంతో వర్సిటీ ఉద్యోగులు తలోరకమైన వాదనలు వినిపిస్తున్నారు. రిజిస్ట్రార్ మార్పు విషయంలో వీసీ వర్సెస్ సర్కార్ అన్నట్టుగా పరిస్థితులు మారడంతోనే జీ తాలు రాలేదని వర్సిటీలో ప్రచారం జరుగుతున్నది.
జీతాలు అందకపోవడంపై ఉద్యోగులు కొందరు చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే వర్సిటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందాయి. కానీ రెగ్యులర్ ఉద్యోగులకు రాలేదు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వారికి ఉన్న విలువ రెగ్యులర్ వారికి లేకుండా పోయిందని ఓ ఆచార్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మిని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా, ఇదివరకు యూనివర్సిటీ జీతాలు చెల్లించేదని, ఈ నెల నుంచి ట్రెజరీ ద్వారా జమ చేస్తున్నారని, దీంతోనే ఆలస్యమైందని తెలిపారు. జీతాల విడుదలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బుధవారం రాత్రి వరకు ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యాయి.