కామారెడ్డి, ఆగస్టు 5 : పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన ‘వెల్కమ్ కిట్’ అటకెక్కింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పేద విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన వెల్కం కిట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభానికి ముందే మే నెలలోనే టెండర్లను ఆహ్వానించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , జనరల్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు ఉచితంగా అందిస్తారు.
ఈ ఏడాది సరఫరా కోసం సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ నేతృత్వంలో ఏజెన్సీ టెండర్ ప్రక్రియ చేపట్టింది. మే నెలలో తొమ్మిది రకాల వస్తువులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ పాఠశాలలు, గురుకులాలు ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు వెల్కం కిట్ల జాడలేదు. వెల్కం కిట్లు అటకెక్కినట్టేనా లేదా అందిస్తారా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలలో పేద విద్యార్థులకు అందించే వెల్కం కిట్లలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ టెక్స్ బుక్స్, స్కూల్ యూనిఫాం రెండు సెట్లు, బెల్ట్, టై, షూ, సాక్సులు, స్కూల్ బ్యాగ్, ట్రంక్ పెట్టె, దుప్పటి, దిండు, దిండు కవర్, టవల్, స్టీల్ ప్లేట్, గ్లాస్, స్పూన్ సెట్, స్వెట్టర్, వింటర్ జాకెట్, లోదస్తులు, సబ్బు, సబ్బు డబ్బా, టూత్ పేస్ట్, బ్రష్, దువ్వెన, నెయిల్ కట్టర్,హెయిర్ ఆయిల్, కుట్టు సామగ్రి, రెయిన్ కోట్, గొడుగు, హ్యాండ్ కర్చిఫ్, లంచ్ బాక్స్ ఉంటాయి. 24 వస్తువులతోకూడిన ఈ కిట్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇప్పటివరకూ విద్యార్థులకు అందకపోవడం గమనార్హం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థుల కోసం అనేక పథకాలను అమలుచేసింది. విద్యార్థులకు పుస్తకాలు, రెండు జతల దుస్తులు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం అందించింది. నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగంపై నిర్లక్ష్యం వహిస్తున్నది. విద్యా రంగ అభివృద్ధికి ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదని పలువురు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పడిపోవడం పరోక్షంగా విద్యాశాఖ తీరును తెలియజేస్తున్నది. పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం తొలగించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలో విద్యావ్యవస్ధ గాడిలో పడేనా అని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు 24 రకాల వస్తువులతో వెల్ కం కిట్లు త్వరలో అందిస్తాం. ఇప్పటి వరకు జిల్లాకు వెల్కం కిట్లు రాలేదు. ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం నుంచి సమాచారం ఉన్నది. వసతి గృహాల్లోని విద్యార్థులకు మాత్రం కిట్‌లోని కొన్నింటిని మాత్ర మే ఇచ్చాం. త్వరలో మొత్తం సామగ్రిని అందిస్తాం.
-మల్లికార్జున్, కామారెడ్డి డీఈవో