KTR | ‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం డిక్లరేషన్‌లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) బృందం సభ్యులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్స్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఈ సంగతే పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, బీమాతో కూడిన సామాజిక భద్రత, సరైన వేతనాలతో పాటు మరణించిన కార్మికులకు పరిహారం చెల్లింపును వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ హామీల అమలు బాధ్యతను తీసుకుంటానన్న రాహుల్ గాంధీ, వీరి సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు.
దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్లైన అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లొకుర్తి నరేశ్‌లకు ప్రభుత్వం ప్రకటించిన ₹5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదని తెలిపారు. వీరి కుటుంబాలు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ పరిహారం అందలేదన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించిన గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన గిగ్ వర్కర్స్ కుటుంబాలకు తక్షణమే ₹5 లక్షల పరిహారాన్ని చెల్లించడంతో పాటు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. కేవలం ఓట్ల కోసం హామీలు ఇచ్చి విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధితో ఉంటే గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గిగ్ కార్మికుల సంక్షేమాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వారి భద్రత, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.