KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్‌కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గంగుల కమలాకర్, వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. డాక్టర్ గౌతమి రెడ్డి స్ఫూర్తితో విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడుకోవాలని కోరారు. ‘స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అన్న జయశంకర్ సార్ మాటలను నిజం చేయాలని సూచించారు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఇక జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోదీ, ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారని అన్నారు.
సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేటీఆర్ అన్నారు. ఈ దాష్టీకాన్ని మేము వదిలిపెట్టమని.. ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అని ప్రశ్నించారు. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడని అన్నారు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా అని నిలదీశారు. దోచుకున్న ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయారు. కానీ, దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారని స్పష్టం చేశారు.