TG Weather | ఈ నెల 28 వరకు తెలంగాణలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది. గురువారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. 26న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళౠఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. 27న ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోనున్న అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా మీదుగా తెలంగాణ వరకు తక్కువ ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.
ఈ క్రమంలో తెలంగాణలో నాలుగు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, ఆసిఫాబాద్ ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
శనివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది.