Minister Adluri Laxman Kumar | ధర్మారం, సెప్టెంబర్ 24: ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో బుధవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో లక్ష్మణ్ కుమార్ గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లంబాడి, గిరిజన, ఆదివాసి తండాలలో చేపట్టవలసిన రోడ్ల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. తర్వాత మల్లాపూర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ డి -83 ప్రధాన కాలువ పక్క నుంచి మల్లాపూర్ నుంచి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామ వరకు నిర్మించే బైపాస్ బీటీ రోడ్డు నిర్మాణ స్థలాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని లంబాడి ,గిరిజన, ఆదివాసీ లంబాడి తండాలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.740 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఉన్న లంబాడి తండాలలో బంజారా భవన్ లు, రోడ్ల అభివృద్ధి ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.35 కోట్ల అంచనాలతో సంబంధిత గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి నిధులతో ఆయా తండాలలో సిసి రోడ్ల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన చేయిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రూ.12 కోట్ల నిధులతో తండాలలో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని ఇంకా కొన్ని ప్రారంభం కావలసి ఉందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం సి ఈ బాలునాయక్, జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఈఈ లక్ష్మణ్ రావు, డి ఈ అశ్విన్, ధర్మారం ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, డైరెక్టర్లు గంధం మహిపాల్, కోల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆశోద అజయ్ కుమార్, ధర్మారం మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, పార్టీ నాయకులు చింతల ప్రదీప్ రెడ్డి, చింతల జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ దుర్గా భవాని ఆలయంలో పూజలు చేశారు.