హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో భర్త ఒక పార్టీలో ఉండి, భార్య మరో పార్టీలో ఉండటం సాధారణంగా చూస్తుం టాం. కానీ ఇక్కడ భర్త అధికార పార్టీకి కొమ్ముకాస్తుంటే, భార్య మాత్రం వ్యతిరేక గళం వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. హైదరాబాద్‌లోని మధు పార్క్ రిడ్జ్ వ్యవహారంలో ఇటీవల అపార్ట్మెంట్ నివాసి ఎంవీ రమణారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించి.. రాత్రికి రాత్రే మనసు మార్చుకున్నారు.
మరుసటిరోజు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ మీడియా కథనాలనే తప్పుబడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తాజాగా రమణారెడ్డి సతీమణి అనితారెడ్డి మాత్రం మధు పార్క్ జోలికొస్తే సహించేదే లేదని, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిరువురి ద్వంద్వ వైఖరిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. డబుల్ గేమ్‌ను ఎండగడుతూ పోస్టులు పెడుతున్నారు. ఓ సోషల్ మీడియా చానల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సోనియాగాంధీని సంతోషపరచడానికే సీఎం రేవంత్‌రెడ్డి తమ ఇండ్లను ఖాళీచేసి గాంధీ విగ్రహం కట్టాలనుకొంటున్నారని మండిపడ్డారు.
గాంధీ విగ్రహం కాకుంటే సోనియాగాంధీ విగ్రహం కట్టుకో! లేదంటే గుడి కట్టుకో! కానీ తమను బలిచేయొద్దని హితవు పలికారు. 5,000 మందిని చంపి పార్క్ కడ్తారా? అంటూ నిలదీశారు. బాపూఘాట్‌కు 2 కిలోమీటర్ల దూరంలో మధు పార్క్ అపార్ట్మెంట్ ఉన్నదని చెప్పారు. తమ అపార్ట్మెంట్ తీసుకొని సీఎం ఫామ్‌హౌస్ కట్టుకొంటారా? అని ప్రశ్నించారు. గాంధీ దేశం కోసం పోరాడినట్టే, తామూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని, ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఆమె వ్యాఖ్యలు, రమణారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను పోస్టుచేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.